- 11 నామినేషన్లకు, మూడు తిరస్కరణ
- వెల్లడించిన నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే పాటిల్
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికల బరిలో ఎనిమిది నామినేషన్లు ఆమోదం పొందాయని, మూడు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా బుధవారం కలెక్టరేట్ లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించారు. నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఒక స్థానం ఎన్నికకు గాను మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఎనిమిది మంది నామినేషన్లను ఆమోదించగా, తక్కిన 3 గురి నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. ఆమోదించిన నామినేషన్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కాసం వెంకటేశ్వర్లు, రాంసింగ్ కొర్రా, బెజ్జం సైదులు, తందు సైదులు, అరుపుల శ్రీశైలం, డా.కె నగేష్, వంగూరి లక్ష్మయ్య నామినేషన్లు ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బడుగుల రవీందర్, దాచేపల్లి నాగేశ్వర్ రావు, పాదూరి గోవర్దని నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి వి.చంద్రశేఖర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జడ్పీసీఈవోలు వీర బ్రహ్మ చారి, సురేష్, కృష్ణారెడ్డి లు ఉన్నారు.