Breaking News

డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం

డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం
  • నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా
  • వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన వారికి జీవిత కాలం, ఐదేళ్లు, మూడేళ్ల జైలు శిక్షలు వేయగలిగామని తెలిపారు. గతేడాదిలో పోలిస్తే కేవలం నాలుగు శాతం మాత్రమే నేరాలు పెరిగాయని, నేరస్తులకు శిక్షలు పడేలా పనిచేయడమే లక్ష్యమని చెప్పారు. డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. గంజాయిని సరఫరా చేస్తున్న వారిని పట్టుకుని వారిపై పీడీయాక్ట్‌ పెట్టి జైలుకు పంపిస్తున్నామన్నారు. ఈ ఏడాది పోలీస్‌ కమిషనరేట్‌లో 1,360 కేసులు నమోదైనట్లు వివరించారు. సైబర్‌ నేరాలపై కేసులు నమోదు చేయడంతో పాటు పోలీసులు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. సైబర్‌ నేరస్తులు ఈ ఏడాది జరిగిన కేసుల్లో రూ.14 కోట్లు కొల్లగొట్టారని అన్నారు. ఇందులో పోలీసులు రూ.8కోట్ల సొమ్మును తిరిగి రాబట్టారని తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది 375 అత్యాచార కేసులు నమోదైనట్లు తెలిపారు. 2,615 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 642 మంది చనిపోయారని తెలిపారు. డ్రంకెన్​డ్రైవ్‌లో 580 మందికి జైలుశిక్ష పడిందన్నారు. మందుబాబులకు విధించిన జరిమానాల్లో రూ.2.02 కోట్లు వచ్చాయన్నారు. హెల్మెట్‌ ధరించని వారికి రూ. 15.33లక్షలు జరిమానా విధించారు. సరూర్‌నగర్‌ లేక్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఈశ్వరయ్యను హీరో ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో సత్కరించారు. ఆయన ఇప్పటివరకు 19మంది ప్రాణాలను కాపాడారని గుర్తుచేశారు.