Breaking News

‘డబుల్’ గుడ్​న్యూస్!

‘డబుల్’ గుడ్న్యూస్!

  • ఇళ్ల ప్రారంభోత్సవానికి
  • అధికార యంత్రాంగం సన్నాహాలు
  • అర్హుల జాబితా వెల్లడికి నిర్ణయం
  • సంగారెడ్డి జిల్లాలో 1,367 ఇళ్లు సిద్ధం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పేదల ఇంటి కలను సహకారం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 1,367 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిని అర్హులైన పేదలకు అందజేసేందుకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పొందేందుకు అర్హుల, అనర్హుల జాబితాను ఇటీవల పూర్తిచేశారు. ఈ లిస్టును మరో రెండు, మూడు రోజుల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో నోటీసు బోర్డులపై అతికించనున్నారు. కాగా, లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రజల నుంచి స్వీకరించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అభ్యంతరాలు వస్తే జిల్లా స్థాయి అధికారుల బృందం మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించి ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని భావిస్తోంది.

జిల్లాలో 1,367 ఇళ్లు పూర్తి

జిల్లాలోని అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని 1,367 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గ్రామాల వారీగా ఇలా ఉన్నాయి. అందోలు నియోజకవర్గంలోని డాకూర్ గ్రామంలో 104, అందోలు – జోగిపేట మున్సిపాలిటీలోని అందోలు వద్ద 216, వడ్డెర, హమాలీ కాలనీలో 108 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తిచేశారు. అలాగే, మునిపల్లిలో 72, నారాయణఖేడ్ నియోజకవర్గం జూకల్ లో 130, జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్, రహమత్ నగర్ లో 312, కంకోల్ లో 96, సంగారెడ్డి నియోజకవర్గంలోని ఫసల్ వాదిలో  265, కలబ్ గూర్, ఫసల్ వాది గ్రామాల్లో 64 ఇళ్లు ఉన్నాయి.

 అర్హుల లిస్టును రెడీ చేస్తున్నాం

సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులన్నీ పూర్తయ్యాయి. విద్యుత్, తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంక్ తదితర అన్ని వసతులు కల్పించాం. లబ్ధిదారులకు కేటాయించేందుకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత నియోజకవర్గాల అధికారులకు ఆదేశాలకు ఇచ్చాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, అర్హులకు మాత్రమే అందించాలని స్పష్టంగా సూచించాం. ఎలాంటి ఆక్షేపణలు, ఆరోపణలు లేకుండా సజావుగా అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకున్నాం. పటాన్ చెరు నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించాం.

– సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు