Breaking News

సిద్దిపేటలో డీలాపడ్డ కాంగ్రెస్

సిద్దిపేటలో డీలాపడ్డ కాంగ్రెస్

  • చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక
  • ప్రచారంలోనూ వెనుకంజ
  • ఇంటింటి ప్రచారానికే పరిమితమైన అభ్యర్థులు
  • పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ డీలా పడిందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో ఆ పార్టీ నెమ్మదిగా బలహీనపడుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను చివరి నిమిషం వరకు ప్రకటించలేదు. ప్రచారమైన మెరుగ్గా నిర్వహిస్తుందనుకుంటే అదీ లేదు. డీసీసీ తీరు నచ్చక చాలామంది సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. దీంతో కేవలం బరిలో నిలిచిన అభ్యర్థులే ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. వారి తరఫున రాష్ట్రస్థాయి అగ్రనాయకులు ఒక్కరూ పాల్గొనడం లేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు చాలామంది పార్టీని వీడటం క్యాడర్​ను కలవరపెడుతోంది.
చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నామినేషన్న విత్ డ్రా వరకు కాంగ్రెస్ పార్టీ తను అభ్యర్థులను గోప్యంగా ఉంచింది. టీఆర్ఎస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలు పలు జాబితాలో పలువురి పేర్లు ప్రకటించినా .. కాంగ్రెస్ పార్టీ మాత్రం నామినేషన్​ విత్ డ్రా చివరి నిమిషంలో తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో 48 వార్డులకు కేవలం 30 మందిని మాత్రమే బరిలో నిలిపింది. ప్రచారమైన నిర్వహిస్తుందనుకుంటే అదీ లేదు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏ గల్లీలో చూసిన టీఆర్ఎస్, బీజేపీ జెండాలే కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ జెండాలు, నాయకులు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు.
ప్రచారానికి సీనియర్లు దూరం
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. ప్రధాన పార్టీలుగా చెప్పుకునే పార్టీలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండేది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో అసలు కాంగ్రెస్ పోటీలో ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అభ్యర్థుల ఎంపిక కోసం వేసిన కమిటీలో సీనియర్లకు చోటు కల్పించకపోవడం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, కాంగ్రెస్ లో సీనియర్లను కాదని తమకిష్టమొచ్చిన వారికి టికెట్లు కేటాయించడం చాలా మంది సీనియర్లకు నచ్చలేదు. దీంతో చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ ఎన్నికలకు దూరం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇంటింటి ప్రచారానికి పరిమితమైన అభ్యర్థులు
కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు రాష్ట్ర నాయకుల రాక కోసం ఎదురుచూశారు. ఏ ఒక్క రాష్ట్ర నాయకుడు కూడా సిద్దిపేటలో ప్రచారానికి రాలేదు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఇన్​ చార్జ్​ గా వ్యవహరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు మాత్రమే పలు వార్డుల్లో తిరిగి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. రాష్ట్రస్థాయి నాయకులెవరూ రాకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తాము ఈ ఎన్నికల్లో పోటీచేశామని దిగాలు చెందుతున్నారు. చేసేదేమి లేక బరిలో నిలిచినందుకైనా ప్రచారం నిర్వహించాలని అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తమ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నారు.

మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు వహిద్ ఖాన్

కాంగ్రెస్ ను వీడుతున్న సీనియర్లు
కాంగ్రెస్ నాయకత్వం తీరు నచ్చక చాలా మంది సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వహీదాఖాన్ తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకుని మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిపోయారు. 34వ వార్డు అభ్యర్థిగా మార్క రాహుల్ గౌడ్, 40 వ వార్డు అభ్యర్థి గా తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్ సైతం కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీచేశారు. వీరు గట్టి పోటీ ఇవ్వనున్నారనే సమాచారం అందడంతో మంత్రి రంగంలోకి దిగారు. వారితో చర్చలు జరిపి టీఆర్ఎస్ లోకి వచ్చేలా చూశారు. వారిద్దరూ రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అందులో 40 వ వార్డు అభ్యర్థిగా తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్ కు టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. అదే విధంగా సోమవారం రోజున కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కొమ్ము ఉమేశ్ యాదవ్ తన అనుచరులతో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎన్నికల వేళ పార్టీని వీడటం అభ్యర్థుల గెలుపు మరింత కష్టతరంగా మారింది. అసలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఒక్క సీటైనా గెలుస్తుందా? లేదా? అన్న అనుమానం సిద్దిపేట పట్టణవాసుల్లో కలుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఎంతమేరకు గట్టెక్కుతుందో వేచిచూడాలి.