- ఎమ్మెల్యేను ఏమన్నా ఊరుకోం
- ప్రజల కోసం సేవచేసే వారిపై విమర్శలు సరికాదు
- మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు
సామాజిక సారథి తిమ్మాజిపేట: అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తూ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. అభివృద్ధిపై బీఎస్పీ నాయకులు కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఎస్పీ ఎదుగుదల కోసం దిగజారి మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. ప్రజలమధ్య ఉంటూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానని ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేకు అండగా ఉండాల్సింది పోయి అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలోని టీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు ప్రదీప్, ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జడ్పీటీసీ దయాకర్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఒండ్రుమట్టి వ్యాపారం పేరుతో స్కూళ్లు నిర్మించారని ఒక ఎమ్మెల్యేపై అగౌరవంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల మద్దతు లేని నాయకులు ప్రజల మధ్యలో ఉండే మర్రి జనార్దన్ రెడ్డిని విమర్శించడం, ఆయనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ హుస్సేనీ, కార్యదర్శి జైపాల్, చేగుంట చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.