- వరంగా మారిన ‘పాలమూరు ఎత్తిపోతల’ పనులు
- కాంట్రాక్టర్లకు చెరువులను రాసిస్తున్న నాయకులు
- తాజాగా ఓ నేత వ్యవహారం వెలుగులోకి…
- నల్లమట్టి కోసం వర్గాలుగా విడిపోతున్న నేతలు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలో నల్లమట్టి సిరులు కురిపిస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొంతమంది రాజకీయాలకు వరంగా మారింది. జిల్లాలోని బిజినేపల్లి మండలంలో మట్టి పాలిటిక్స్నడుస్తున్నాయి. మండలంలో ప్రధాన పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నది. ఆ పార్టీలో ఇప్పుడు వర్గాలపోరు తీవ్రమవడంతో నాయకులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోతున్నారు. బిజినేపల్లి మండలంలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం గ్రామంలో సుమారు 15 టీఎంసీలకుపైగా నీటిని నిల్వచేసే రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి మండలంలోని కొందరు లీడర్లకు మాత్రం కాసులవర్షం కురుస్తోంది. రిజర్వాయర్ నిర్మాణానికి పెద్దఎత్తున చెరువుల్లోని నల్లమట్టి అవసరం కావడంతో కాంట్రాక్టర్లు నేరుగా అధికారులను కాకుండా టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వారు ఓకే చెబితే యథేచ్ఛగా నల్లమట్టిని తవ్వుతున్నారు. వాటిని పట్టించుకోని నాయకులు రూ.కోట్లకు ఆశపడి చెరువులను కాంట్రాక్టర్లకు రాసి ఇస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా ఆయకట్టు పరిధిలోని రైతులు మత్స్యకారులు నష్టపోతున్నారు.
నేతల మధ్య పంచాయితీ పరంపర
నాగర్ కర్నూల్జిల్లా పరిధిలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైన నాటి నుంచి నల్లమట్టి పంచాయితీ కొనసాగుతూ వస్తోంది. కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులతో పాటు స్థానిక, నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా పెద్దఎత్తున డబ్బులు ముట్టచెప్పి నల్లమట్టిని దోచుకెళ్తున్నారు. వీటిపై విపక్షపార్టీలు స్థానిక పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ వరకు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారం కలెక్టర్వరకు కూడా వెళ్లడంతో జిల్లాలో నల్లమట్టి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ముఖ్యంగా బిజినేపల్లి మండలంలో సుమారు ఏడెనిమిది గ్రామాల్లోని చెరువుల నల్లమట్టిని తోడుకోవడంతో పాటు.. మరో అడుగు ముందుకేసి కొన్ని కంపెనీల కాంట్రాక్టర్లు శిఖం భూముల్లో కూడా నల్లమట్టిని తవ్వుతున్నారు. అక్కడి భూములను కూడా రైతులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. కొందరు నాయకులు మాత్రం తమకు తోచిన విధంగా రైతుల నోట్లోమట్టి కొడుతూ చెరువులను ధారాదత్తం చేస్తున్నారు.
చెరువును రాసిచ్చారు!
బిజినేపల్లి మండల కేంద్రంలోని చాకలివాని చెరువులోని నల్లమట్టిని తోడుకునేందుకు కర్వెన రిజర్వాయర్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ కు తాజాగా మండలంలోని కీలక నాయకుడు ధారాదత్తం చేయడంతో మిగిలిన నాయకులు అతనిపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎలాగైనా కేసు చేయించాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా చెరువులోని నీటిని వదిలిపెట్టి ఆయకట్టు రైతుల పంటలకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఇంత బహిరంగంగా నల్లమట్టిని అమ్ముకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయకట్టుదారులు, స్థానికులు భగ్గమంటున్నారు.