Breaking News

కేసీఆర్.. జగన్​కు నీళ్లు అమ్ముకున్నడు

దక్షిణ తెలంగాణకు ద్రోహం చేసిండు

  • కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత
  • తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం
  • దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు
  • ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
  • మాజీమంత్రి నాగం జనార్దన్​రెడ్డి వ్యాఖ్యలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని అబద్దాలు చెప్పి ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)ను మోసంచేసే యత్నం చేశారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. దీనిని ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఎందుకు ప్రకటించలేదని, దానికి కావాల్సిన అనుమతులు కేంద్రం నుంచి ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు నీటి పరీవాహక ప్రాంతంలో ఉన్నందుకు కృష్ణానీటిని వినియోగించుకునే హక్కు పూర్తిగా ఉందని గుర్తుచేశారు. తన నివాసంలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఈ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరద నీరు సముద్రం పాలవుతోందన్నారు. వరద నీటిని ఆపుకుని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునేందుకు అవకాశం ఉండేదన్నారు.

దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం
కృష్ణానది జలాల నుంచి 811 టీఎంసీల్లో 575 టీఎంసీల నీటివాటా మనకు రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుని వచ్చాడని, దక్షిణ తెలంగాణకే తీరని ద్రోహం చేశాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు తరిమికొడతారని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తీవ్రంగా కరువుతో ఉన్న ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఉత్తర తెలంగాణాలో దోపిడీ చేస్తున్న కేసీఆర్ కేవలం రూ.76 కోట్ల విలువైన చిన్న లిఫ్ట్ ను బిజినేపల్లి మండలంలో మార్కండేయ పథకాన్ని ప్రారంభించడం లేదన్నారు. కృష్ణజలాలను ఏపీ సీఎం జగన్ కు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఈ ఏడాది కృష్ణానదిలో జలాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. నీటిని విద్యుదుత్పత్తి కోసం సముద్రం పాలు చేశారన్నారు. నీళ్లు లేక 802 లెవెల్ కు తక్కువకు నీరు అడుగంటిపోయి వేలాది ఎకరాల్లో పొలాలు ఎండి పోయాయని వెల్లడించారు. పంటలు ఎండి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.