- బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదు
- సీఎం కేసీఆర్‌పై నడ్డా వ్యాఖ్యలు అమానుషం
- ప్రధాని మోడీ రైతుల ఉసురు పోసుకుంటున్నారు
- అందుకే పంజాబ్‌లో రైతన్నల అవమానం
- మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్
సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ.. అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని మంత్రి కె.తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రైతు విరోధిగా మారానని దుయ్యబట్టారు. దేశంలో ఏడున్నరేళ్లుగా ప్రజాకంటక పాలన అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులను దారుణంగా హింసించి, పెట్రోగ్యాస్ ధరలు పెంచి.. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుని, నిరుద్యోగుల ఉసురుపోసుకున్న పాలన వారిదేనని అన్నారు. బుధవారం మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి.శ్రీనివాసగౌడ్ తదితరులతో కలసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్‌కు ఆయనకు పెద్ద తేడా ఏమీలేదు. సీఎం కేసీఆర్మతిభ్రమించిందన్న నడ్డాకు.. నిజంగానే మతి భ్రమించింది’ అన్నారు. కేంద్రమంత్రుల, ప్రభుత్వం పార్లమెంట్లో కాళేశ్వరంతో సహా అనేక విషయాల్లో తెలంగాణకు అనుకూలంగా చేసిన ప్రకటనలు ఆయన మీడియా ముందుంచారు. వీటిని చూస్తే నిజంగానే నడ్డాకు మతిభ్రిమించిదని అనుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీని పంజాబ్ రైతులు అడ్డుకున్నారంటే దేశచరిత్రలో ఏ ప్రధాన మంత్రికి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎదురుకాలేదన్నారు. సిగ్గులేని, నీతిలేనిది మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అంటూ దుయ్యబట్టారు.
సబ్‌కా సాత్.. సబ్‌కా వినాశ్
తెలంగాణ పథకాలు రైతుబంధు, మిషన్ భగీరథలను కాపీ కొట్టి రాస్ట్రంలో ఏమీ జరగలేదని చెప్పడం దారుణమన్నారు. దేశంలో చిచ్చుపెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ఆలోచన చేస్తుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరంటే బీజేపీ, ఈడీ, సీబీఐ, ఐటీలే గుర్తుకొస్తాయన్నారు. ఢిల్లీలో కొంత మీడియా మోడీయాగా మారిందని దుయ్యబట్టారు. యూపీలో బీజేపీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. దేశంలో 2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీకి సంబంధించిన ప్రకటనను మంత్రి కేటీఆర్మీడియాకు చూపించారు. చీకట్లో గాడ్సేను మొక్కుతారు. బయట గాంధీని మొక్కుతారు.. అని విమర్శించారు. అవినీతి గురించి జేపీ నడ్డా మాట్లాడతారా? కర్ణాటక అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రమని తేలిందన్నారు. బీజేపీ హిందూ, ముస్లింల మధ్య గొడవపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వినాశ్.. సామాన్యుడికి శోకం.. కార్పొరేట్లకు కనకాభిషేకం’ అని అన్నారు.