Breaking News

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఊరెళ్తున్నారా.. జరభద్రం!
  • కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి
  • ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
  • సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రివేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. విలువైన వస్తువులను స్కూటర్‌ డిక్కీల్లో, కార్లలో పెట్టకూడదు. బైక్​లు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్‌ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచకూడదు. తమతో పాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనిపించకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలని సూచించారు. ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలన్నారు. ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌, పాలవారిని రావద్దని చెప్పాలని సూచించారు. పనిమనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలని,  విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడని సూచించారు. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హోమ్‌ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్​నెట్​అనుసంధానం ఉన్న మీ మొబైల్‌ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచైనా ప్రత్యక్షంగా చూసుకునే వీలుందన్నారు. పోలీస్​స్టేషన్‌ నంబర్‌, వీధుల్లోకి వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌ నంబర్​ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం ఈజీ అవుతుందని తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నంబర్​ను సంబంధిత పోలీస్​స్టేషన్‌ అధికారులకు తెలియజేయాలని కోరారు. కొత్త వ్యక్తుల కదలికలపై 100కు డయల్‌ లేదా సైబరాబాద్‌ పోలీసు వాట్సాప్‌ నంబర్​94906 17444 కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు.