Breaking News

హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

  • కరోనా నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది
  • తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది
  • సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, కోర్టు ఇప్పటికీ 87 పిల్స్ ను స్వీకరించిందని, నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతోందని, ఈ క్లిష్టసమయంలో చేయాల్సిన పనులను వదిలిపెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతోందని, దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. కరోనాపై మంగళవారం ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, వైద్యాధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం కొంత బాధకలిగిస్తుందని అన్నారు. వైరస్ నిర్ధారిత పరీక్షలు, జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన వివరాలు, చేస్తున్న పనిని తెలియజేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.


కొత్త సెక్రటేరియట్ ​హుందాగా ఉండాలె
తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. డిజైన్లను ఆయన స్వయంగా పరిశీలించారు. కొన్ని మార్పులు సూచించారు. పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులు వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలు ఉండాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఒక డైనింగ్ హాలు, సమావేశ మందిరం ఉండాలని చెప్పారు. వీఐపీలు, డెలిగేట్స్, డిగ్నిటరీస్, ఇతర ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు ఉండాలని చెప్పారు.