- సినీనటుడికి గుడి కట్టిన వీరాభిమాని
- సిద్దిపేట జిల్లా చెలిమితండాలో విగ్రహావిష్కరణ
సారథి న్యూస్, హుస్నాబాద్: సాధారణంగా దేవుళ్లకు గుళ్లుగోపురాలు కడుతుంటారు.. కానీ ఓ మనిషిలో దేవుడిని చూసి.. ఆ మనిషికే గుడి కట్టాడు ఓ అభిమాని. దైవంగా భావించి ఆ ఊరులో పూజలు అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు సుప్రసిద్ధ బాలీవుడ్ సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించినప్పటికీ ఆయన ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలందరికీ విశేషమైన సేవలందించి ప్రపంచంలోనే రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఆయనకు ఏకంగా గుడి కట్టేశాడు. ఏకంగా తన సొంత ఖర్చుతో భారీ విగ్రహాన్నే ప్రతిష్ఠించాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బతండా అనుబంధ గ్రామమైన చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్ సోనూసూద్ వీరాభిమాని. కరోనా సమయంలో ఆయన చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్ తమ తండాలో సొంత ఖర్చులతో సోనూసూద్ విగ్రహాన్నే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా మద్దూర్ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో సోనూసూద్ కుల, మతభేదాలు లేకుండా పేదల పక్షాన నీలిచిన ఆపద్బాంధవుడని కొనియాడారు. అనంతరం స్థానికులు సోనూసూద్ విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి కూడా ఇచ్చారు. రాజేష్ సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండావాసులు, పలు గ్రామాల ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కమలాకర్, సీపీఎం మండల కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.