Breaking News

సెలబ్రెటీల గ్రీన్ చాలెంజ్

చాలెంజ్​గా తీసుకున్నరు

‘పుడమి పచ్చగుండాలే.. మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో మొదలుపెట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో సినీరాజకీయ క్రీడా ప్రముఖులు, సినీసెలబ్రిటీలు కూడా భాగస్వాములు అవుతున్నారు. మొదట ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటి చాలెంజ్ విసరడంతో హీరో అఖిల్ అక్కినేని, ఎంపీ కవిత మొక్కలు నాటారు. ఆ తర్వాత గ్రీన్ చాలెంజ్ స్వీకరించిన అక్కినేని నాగార్జున, రోజా, అర్జున్, కేటీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, సచిన్, లక్ష్మణ్, సైనా నెహ్వాల్, గోపిచంద్ వంటి ప్రముఖులంతా భాగస్వాములు అవుతూ మొక్కలు నాటారు.

కాగా, ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ మూడవ విడతలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తో కలసి మొక్కలను నాటాడు. కృష్ణంరాజు విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ మూడు మొక్కలు నాటి మూడవ దశకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు సమంత, శర్వానంద్, రష్మిక మందన్న, రాశీఖన్నా, అనుపమ పరమేశ్వరన్, సంపత్ నంది.. తదితర సినీ ప్రముఖులు కూడా ఈ చాలెంజ్ లో మొక్కలు నాటారు. అయితే ఈ కార్యక్రమానికి సెలబ్రెటీలు స్పందించడం బాగానే ఉంది. కానీ, ఇంతవరకు నాటిన మొక్కలను సంరక్షిస్తున్నారో లేదో కూడా ఓ కన్నేసి ఉంచాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొక్కలను నాటి ఫొటోలు దిగడం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా నాటిన మొక్కలను స్వయంగా సంరక్షిస్తేనే ఇంకా మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు తప్ప ఆల్ మోస్ట్ సెలబ్రెటీలు అంతా మొక్కల్ని తమ సొంత పెరట్లోనే నాటారు. కాబట్టి వాటిపై కన్నేసి ఉంచడం కూడా పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. అంటే ఎవరి మొక్కలను వారు కాపాడుకుంటున్నారనేగా అర్థం.