సారథి న్యూస్, హైదరాబాద్: కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మతపెద్దలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలపై వారితో కూలంకషంగా చర్చించారు. వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ సాహబ్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్, మజ్లిస్ ఉలేమా ఇ డెక్కన్ ప్రెసిడెంట్ మౌలానా సయ్యద్ కుబూల్ బాద్ షా షట్టారి, మౌతమీమ్ దారుల్ ఉలూమ్ రహ్మానియా, ప్రెసిడెంట్ జామియత్ ఉలేమా ఇ హింద్ మౌలానా ముఫ్తీ ఘ్యాసుద్దీన్ రహ్మానీ, అమీర్ ఈ జామియా నిజాయా మౌలానా సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ పాల్గొన్నారు.
సీఎం తీసుకున్న నిర్ణయాలివే..
- పాత సెక్రటేరియట్ భవనాలు కూల్చి వేస్తున్న సందర్భంలో అక్కడున్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లింది. వాటిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించనున్నారు.
- ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్ తో సహా రెండు మసీదులు (మొత్తం 1500 చదరపు అడుగులు) ప్రభుత్వం నిర్మించనున్నది.
- పాత సెక్రటేరియట్ లో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తారు.
- 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయశాఖకు మందిరాన్ని అప్పగిస్తుంది.
- క్రిస్టయన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది.
- అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నింటికి ఒకే రోజు శంకుస్థాపన చేయనున్నారు.
- ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్ – ఉల్ – గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తాం. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయింది. మరో 18 కోట్లు అవసరమవుతాయి. వాటిని వెంటనే విడుదల చేసి, నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయనున్నారు.
- అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్థలం కూడా కేటాయించింది. కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. వెంటనే ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
- హైదరాబాద్ నగరం చుట్టూ ఖబ్రస్థాన్ లు రావాల్సిన అవసరం ఉన్నది. స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను కోరాం. వారు కొన్ని స్థలాలు గుర్తించారు. నగరంలోని వివిధ చోట్ల మొత్తం 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్ లు ఏర్పాటు చేయనున్నారు.
- నారాయణపేటలో రోడ్ల వెడల్పు కార్యక్రమం సందర్భంగా పీరీల చావడి అయిన అసుర్ ఖానాకు నష్టం వాటిల్లింది. దీనికి స్థలం కేటాయించి, నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ను ఆదేశాలు జారీచేశారు.
- రాష్ట్రంలో ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తిస్తున్నాం. భాషా పరిరక్షణ, అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడతాం. అందుకోసం అధికార భాష సంఘంలో ఉర్థూ భాషాభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. అధికార భాష సంఘంలో ఉర్ధూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా నియమించనున్నారు.