సారథి న్యూస్, కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏంచేశారని, హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేసినందుకే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అన్నారు. రాష్ట్రంలో అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాన్న లక్ష్యంతో పోరాడుతున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కనీస జ్ఞానం కూడా లేకపోయిందని ఘాటుగా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను తప్పుబడుతూ అభివృద్ధిని అడ్డుకునేలా కుట్రలు చేయడం చంద్రబాబు నాయుడుకు తగదన్నారు. కేవలం పెట్టుబడిదారులను మాత్రమే కాపాడుకోవడానికే అమరావతిని రాజధానిగా కోరుతున్నారని విమర్శించారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తే పరిశ్రమలు ఏర్పాటవుతాయని, విమనాశ్రయం, హైకోర్టుతో అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్, జిల్లా కార్యదర్శి రైల్వే ప్రసాద్, కేవీ సుబ్బారెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు కృష్ణకాంత్ రెడ్డి పాల్గొన్నారు.