న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగుతున్నది. బహిరంగ లేఖ విషయంపై రాహుల్ గాంధీ సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ వైఖరిపై సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఓ దశలో వారిద్దరూ రాజీనామాకు సిద్ధపడ్డట్టు జాతీయమీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది. సమావేశమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తాను ఇక అధ్యక్షురాలిగా కొనసాగలేనని.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ పార్టీ సీనియర్లను కోరినట్టు సమాచారం.
గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. పార్టీ అధినాయకత్వాన్ని తక్కువ చేసి చూపేలా లేఖ రాయడం సరికాదంటూ సహచరులపై అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. కాగా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.