సారథి న్యూస్, హైదరాబాద్: కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని అన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
‘తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రకాల స్వభావాలు కలిగిన నేలలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 900-1500 మి.మీ. వార్షిక సగటు వర్షపాతం ఉంది. వృత్తి నైపుణ్యం కలిగిన లక్షలాది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ తోటల సాగుకు ఎంతో సానుకూలం. ఇంత ఉండి కూడా ఇంకా వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు, మసాలా దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. ఉద్యానవన పంటల్లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలి. సాగులో అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలవాలి. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, నెదర్లాండ్ లాంటి దేశాల్లో ఉద్యానవన పంటలు అద్భుతంగా పండిస్తున్నారు. అక్కడికి వెళ్లి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. తెలంగాణకు చెందిన ఉద్యానవన శాఖ అధికారులను బెంగులూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ కు పంపి శిక్షణ ఇప్పించాలి. అక్కడి నుంచి నిపుణులను తెలంగాణకు ఆహ్వానించి, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. హార్టికల్చర్ యూనివర్సిటీ, ఉద్యానవన శాఖలో తోటలపై పరిశోధనలు విస్తృతంగా జరపాలి. ఉద్యానవన పంటల సాగులో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ పై ఎప్పటికప్పుడు అధ్యయనం జరగాలి. ఈ శిక్షణ, అధ్యయనం ప్రక్రియ నిరంతరాయంగా సాగాలి. ఉద్యానవన తోటల సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘రాష్ట్రంలో ఉద్యానవన పంటలను పెద్దఎత్తున సాగు చేయడంతో పాటు అవసరమైన మార్కెటింగ్ విషయంలో కూడా దృష్టిపెట్టాలి. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏది అవసరమో గుర్తించి, వాటిని రైతులతో సాగు చేయించాలి. ఢిల్లీ ఆజాద్ పూర్ మార్కెట్ తరహాలో హైదరాబాద్ కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్ ను నెలకొల్పుతాం’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, ఉద్యానవన శాఖ ఎండీ వెంకట్రాంరెడ్డి, జేడీ సరోజన, డీడీ సునంద, సీనియర్ అధికారులు సత్తార్, బాబు, భాగ్యలక్ష్మి, మధుసూదన్, లహరి, సుభాషిణి పాల్గొన్నారు.