Breaking News

సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సారథి న్యూస్, కర్నూలు: ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసేందుకు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ ఆరు క్లస్టర్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 19 రకాల సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 1,276 పోస్టులకు గాను 85,910 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో పురుషులు 40,403, మహిళలు 45,507, పీహెచ్ పర్సన్స్ 1431 మంది ఉన్నారని వెల్లడించారు. వారి కోసం 260 పరీక్ష కేంద్రాలు, 5,542 రూమ్​లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జడ్పీలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో హెల్ప్ డెస్క్​లను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు జిల్లావ్యాప్తంగా 303 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రానికి వచ్చేవారు ఫ్రీగా రావచ్చన్నారు. ఇప్పటికే 70శాతం మంది హాల్​ టికెట్లను డౌన్ లోడ్​ చేసుకున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప మాట్లాడుతూ.. సచివాలయం పరీక్షలకు మూడంచెల పోలీసు బందోబస్తు, స్ట్రాంగ్ రూములకు భారీ భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రతి సెంటర్​ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.