సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సన్నాహాలు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, కర్నూలు క్లస్టర్ల పరిధిలో ఉదయం 127 పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్నం 67 కేంద్రాలు మొత్తం కలిపి 194 కేంద్రాల్లోని 5,542 గదుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 19 విభాగాల్లో 1,276 పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
85,910 మంది 19 రకాల పోస్టుల దరఖాస్తు చేసుకోగా, అందులో మహిళలు 40,403 (కేటగిరీ-1 కేటగిరీ -3) దరఖాస్తు చేసుకోగా పురుషులు 45,507 మంది, పీహెచ్ కేండిడేట్స్ 1431 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 51,057 మంది, మధ్యాహ్నం 34,853 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
జడ్పీలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటుచేశారు. జడ్పీ ఆఫీసులోని ఆరు క్లస్టర్ల పరిధిలో జరిగే పరీక్షలకు అవసరమైన సామగ్రిని జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ స్వయంగా దగ్గరుండి పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అభ్యర్థులకు ముందుగానే కోవిడ్ పరీక్షలను నిర్వహించి థర్మల్ గన్ తో ఉష్ణోగ్రతను తెలుసుకుని సెంటర్ లోపలికి అనుమతించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం 303 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజర్ టి.వెంకటరామం తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప పేర్కొన్నారు.
- September 20, 2020
- Archive
- Top News
- కర్నూలు
- లోకల్ న్యూస్
- COLLECTOR
- Kurnool
- SECRETARIAT EXAM
- VEERAPANDIAN
- కర్నూలు
- కలెక్టర్ వీరపాండియన్
- సచివాలయ పరీక్షలు
- Comments Off on సచివాలయ పరీక్షలకు అంతా రెడీ