Breaking News

వైద్యులు ఎంతగొప్ప పనిచేశారో..

మనస్సున్న మహారాజులు.. ఈ వైద్యులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: వారంతా ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసే డాక్టర్లు.. ఆ వృత్తిలో వారంతా నిష్ణాతులు. రోగులు, చికిత్సలు, శస్త్రచికిత్సలతో క్షణం తీరిక లేకుండా గడిపే వైద్యులు. కరోనా కష్టకాలంలోనూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు ఆయువు పోస్తున్న సేవాతత్పరులు. కోవిడ్‌-19 రాష్ట్రంలో వ్యాపించినప్పటి నుంచి వంతుల వారీగా డ్యూటీలు చేస్తూ.. వైరస్‌ విజృంభణతో కుటుంబాలకు దూరంగా గడుపుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కార్యదీక్షులు. ఈ క్రమంలో కరోనాకు చికిత్సలు అందించే డాక్టర్లు అత్యంత ప్రధానమైంది పీపీఈ కిట్లు. వీటిని ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి పంపాలంటూ ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం సరిగ్గా పట్టించుకోలేదు.

Time(required)

నెరవేరిన హెచ్‌ఆర్‌డీఏ సంకల్పం
రాష్ట్ర ప్రభుత్వం కరోనా తొలి దశలో(మార్చి, ఏప్రిల్‌ నెలలు) తన శక్తిమేరకు వీలైనంతగా కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో హైదరాబాద్‌ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న హెల్త్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సాయానికి తోడు తనవంతుగా సర్కారీ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందించాలని నిర్ణయించింది. తద్వారా వైద్యులు కోవిడ్‌ బారినపడకుండా.. తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూనే రోగులకు సేవలందించేందుకు వీలు కలుగుతుందని భావించింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా హెచ్‌ఆర్‌డీఏ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, వరంగల్‌ లోని ఎంజీఎం మెడికల్​ కాలేజీకి చెందిన పూర్వవిద్యార్థులు, అక్కడ చదువుకుని వైద్యరంగంలో స్థిరపడిన వారి ముందూ తమ ఆలోచలు పంచుకున్నారు.

దీంతోపాటు తమ హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులకు విషయాన్ని చెప్పారు. కరోనా నేపథ్యంలో వైద్యులకు అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌసు​లు పంపిణీ చేసేందుకు వీలుగా ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో మార్చి నుంచి ఇప్పటి దాకా రూ.60 లక్షల విరాళాలను హెచ్‌ఆర్‌డీఏ సేకరించింది. ఆ డబ్బు ద్వారా పీపీఈ కిట్లతోపాటు ఇతరాలను కొనుగోలు చేశారు. తద్వారా మారుమూలన ఉన్న పీహెచ్‌సీల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా దాకా దాదాపు నాలుగువేల మంది డాక్టర్లు, మరో 1,500 మంది నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి వీటిని అందజేశారు. తాజాగా ఫేస్‌ షీల్డ్‌ (ప్లాస్టిక్‌తో తయారు చేసేవి, ముఖానికి ధరించేవి), మాస్కులను పంపిణీ చేసేందుకు హెచ్‌ఆర్‌డీఏ ప్రతినిధులు సమాయత్తమవుతున్నారు.

మున్ముందు మరిన్ని సేవలు
కరోనా ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదు. అందువల్ల ఈ మహమ్మారి ఉన్నంతకాలం ఇటు సాధారణ ప్రజలు, కోవిడ్‌ సోకినవారు, అటు వారికి వైద్యమందించే డాక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ క్రమంలో మేం ఇంకో ఆరేడు నెలల వరకూ పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌస్​ల పంపిణీ కొనసాగిస్తాం. తద్వారా వైద్యుల ఆరోగ్యాన్ని కాపాడడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాం. మా ఈ ప్రయత్నానికి ఆర్థికంగా, హార్థికంగా సహకరిస్తున్న వారందరికీ హెచ్‌ఆర్‌డీఏ తరఫున ధన్యవాదాలు.
:: డాక్టర్‌ మహేశ్‌, హెచ్‌ఆర్‌డీఏ అధ్యక్షుడు