సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ పంచాయతీ కార్యదర్శితో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన రమాదేవికి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇంటి పన్నుల నిర్వహణ, ఇండ్లకు అనుమతుల జారీ, ఇంటి యజమాని పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం తదితర అంశాల గురించి ఆరా తీశారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ అయిందా? లేదా? అనే విషయాలపైనా సీఎం ఆరాతీశారు. సీఎం అడిగిన వివరాలను చెప్పినట్లు కార్యదర్శి రమాదేవి తెలిపారు. తొలుత రమాదేవికి ఫోన్ చేశాక సీఎం కార్యాలయ సిబ్బంది ఆమెతో మాట్లాడారు. వినోద్ మాట్లాడతారని చెప్పారు. వినోద్ రమాదేవితో మాట్లాడుతూ.. మీతో సీఎం గారు మాట్లాడతారని, తర్వాత మాట్లాడే వ్యక్తి సీఎం అని లైన్ ఉండాలని కోరారు. తర్వాత కాసేపటికి సీఎం రమాదేవితో మాట్లాడారు. తాను ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎకరంన్నర పరిధిలో ఇల్లు కట్టుకున్నానని, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలంటే అది వ్యవసాయ భూమి కాబట్టి, వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నానని సీఎం తెలిపారు. ఇందుకోసం పన్ను చెల్లించినట్లు చెప్పారు. ఇలాగే వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నవారు లేదా గ్రామాల పరిధిలో ఇల్లు ఉండి లెక్కల్లో లేనివారు పంచాయతీలో నమోదు చేయించుకోవాలని కేసీఆర్ కోరారు.