తిరువనంతపురం: దుబాయ్ నుంచి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు వస్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం లోయలోపడి రెండు ముక్కలు కావడంతో పైలట్, ఐదుగురు సిబ్బందితో పాటు మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ ఇండియాకు చెందిన డీఎక్స్ బీసీసీజే బోయింగ్ 737 విమానం రన్‌వే పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. రన్‌వే పైకి నీరు రావడంతోనే ప్రమాదం జరిగిఉండవచ్చని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్‌చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.