Breaking News

వారెక్కడ?

తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వారే పార్టీకి దూరంగా ఉన్నారా.. లేక పార్టీయే వారిని దూరం పెట్టిందా.. వారు దూరంగా ఉండడానికి యువనేత లోకేష్‌ పాత్ర ఏమైనా ఉందా.. యువకులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో వారిని పక్కన పెట్టారా..? ఇలా అనేక అనుమానాలు టీడీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వడ్డే శోభనాదీశ్వరరావు ఎంతో పెద్ద సీనియర్‌ నేత. కృష్ణా జిల్లాలో ది మోస్ట్‌ సీనియర్‌ రాజకీయ వేత్త. రైతు కూడా. ఎన్టీఆర్‌ సమకాలికుడుగా చెబుతుంటారు. టీడీపీలో మరింతగా ఎదగాల్సిన ఆయన అక్కడే ఆగారు.. రాజకీయాలకు దూరంగా జరిగారు. బుచ్చయ్యచౌదరి.. తెలుగుదేశం పార్టీకు కష్టాలు వచ్చినపుడు కూడా వీడని బలమైన నాయకుడు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎందుకో అనుకున్నంతగా ఎదగలేక పోయారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు.. చివర్లో మంత్రి కావాలని చాలా ఉబలాటపడ్డారు. కల నెరవేరకుండానే కాలం చేశారు. ఇప్పటికీ ఆయన వారసులు పట్టుకోసం కోట్లాడుకుంటూనే ఉన్నారు. గల్లా అరుణ.. సీనియర్‌ నాయకురాలు. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చినా.. ఇప్పటికీ ఆమె జాడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది.

ఇలా… ఏపీలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా జెండామోసి ఎమ్మెల్యేగా ఎదిగిన సీనియర్లు చాలామంది అలాగే ఉన్నారు. ఆత్మాభిమానం చంపుకుని వేరే పార్టీలోకి చేరలేక.. పసుపు చొక్కా వేసుకుని రాజకీయాలు నడుపుతున్నారు. అధినేత చంద్రబాబునాయుడు అవకాశం ఇవ్వకపోతాడా! అని ఆశగా చూస్తున్నారు. 2014లో టీడీపీ అనూహ్యంగా బీజేపీ, జనసేనతో కలసి గెలవగానే కొత్త నేతలు తెరమీదకు వచ్చారు. రాత్రికి రాత్రే మంత్రులు, ఎంపీలుగా మారిన బడా బాబులున్నారు. ఇవన్నీ జెండామోసిన సీనియర్లకు అవమానమనే చెప్పాలి. ఐదేళ్లపాటు పార్టీలో ఉన్నా.. సీనియర్లు.. బాబు అపాయింట్‌మెంట్‌ దొరకనంతగా వెనుకబడ్డారు. ఇప్పుడు వైసీపీ సర్కారు.. రాబోయే ఐదేళ్లలో టీడీపీ బలం పుంజుకుంటుందనే ఆనవాళ్లు లేవు. పైగా.. పాత కేసులు, కొత్త ఫిర్యాదులతో పోలీస్‌ స్టేషన్‌ గుమ్మం చుట్టూ తిరిగే పరిస్థితిలో చాలామంది తెలుగు తమ్ముళ్లున్నారు. వయసులో ఉన్నారు కాబట్టి.. సరిపోయింది. వయసు మళ్లిన నేతలకు ఇది సవాల్‌గా మారిందనే చెప్పాలి. అందుకే.. ఈ వేదన మా వల్ల కాదంటూ.. కేసులకు భయపడో.. జైలు ఊచలు గుర్తొచ్చో.. జగన్‌ ఎదుట కండువా మార్చుకున్నారు. మాజీ మంత్రి శిద్దా, ఎమ్మెల్యే కరణం, నేడోరేపో… మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్‌ కిందకు చేరబోతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సీనియర్లు మౌనంగా ఉండటమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. అందుకే.. వైసీపీ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా కామెంట్‌ చేయకుండా చూస్తూ ఉండిపోతున్నారట.