Breaking News

వరకట్నం వేధింపులకు మహిళ బలి

వరకట్నం వేధింపులకు మహిళ బలి

సారథి న్యూస్, అలంపూర్: వరకట్నం వేధింపులకు ఓ ఇల్లాలు బలైంది. అనుమానాస్పదస్థితి ఉరివేసుకుని చనిపోయింది. శుక్రవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల వివరాల మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, పద్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు సాహితీని అదే గ్రామానికి చెందిన హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేసే జింకల కిరణ్ కుమార్ రెడ్డికి 50 తులాల బంగారం, రూ.పదిలక్షల నగదు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే రెండేళ్లు సాఫీగా సాగిన జీవితంలో అదనపు కట్నంకోసం వేధింపులు మొదలయ్యాయి. ఇదే సందర్భంలో పుట్టింటివారు రూ.లక్ష కూడా ఇచ్చారు.

అయితే లాక్ డౌన్ కారణంగా భర్త ఊర్లోని ఉంటూ వర్క్ ఫ్రామ్ హోం నుంచే డ్యూటీ చేస్తున్నాడు. ఆరునెలలుగా మామ గోపాల్ రెడ్డి చేసిన అప్పులు కట్టేందుకు డబ్బులు లేవని పుట్టింటి నుంచి 10 ఎకరాల ఆస్తి రాయించుకుని రావాలని ఒత్తిడి తెచ్చారు. మళ్లీ పంచాయితీ పెట్టిన అత్తమామల బుద్ధి మారలేదు. శుక్రవారం ఉదయం తమ కూతురు ఉరివేసుకుని చనిపోయిందన్న సమాచారం అందింది. భర్త, అత్తమామలే తమ కూతురును చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. పోస్టుమార్టం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.