న్యూఢిల్లీ: అమెరికాలో ఇరుక్కుపోయిన మనవాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా నడుపుతున్న వందేభారత్ ఫ్లైట్లపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఫ్లైట్లు నడపకుండా ఇండియన్ గవర్నమెంట్ నిషేధం విధించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికన్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఇప్పటి నుంచి ఫ్లైట్లు నడపాలంటే కచ్చితంగా 30 రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకోవాలని కొత్త నిబంధనలు ఇచ్చింది.
మూడో విడత వందేభారత్ మిషన్ కింద అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి ఇండియా ఈ నెల 12 నుంచి జులై 2 వరకు 96 ఫ్లైట్లను నడపుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఎస్ ఇచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల అవి నిడిచే అవకాశం కనిపించడం లేదు. కాగా, ఈ విషయంపై ఇంకా మన ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అమెరికాకు రావాల్సిన, అమెరికానుంచి వెళ్లాల్సిన ఎయిర్‌లైన్స్ సర్వీసులపై నిబంధనలు పెట్టి వ్యత్యాసాలు చూపుతోందని యూఎస్ ఆరోపించింది. విదేశాల్లో ఇరుక్కున్న మనవాళ్లను ఇళ్లకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.