Breaking News

లక్ష ఇళ్ల పేరుతో ఎంతకాలం మోసం

లక్ష ఇళ్ల పేరుతో ఎంతకాలం మోసం

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో లక్ష ఇళ్లను చూపిస్తామన్న ప్రభుత్వం.. చూపించలేక పారిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష ఇళ్లపేరుతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప‌రిశీల‌న శుక్రవారం అర్థాంత‌రంగా ఆగిపోవ‌డం, మీకు చూపించ‌లేమ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వెళ్లిపోవడంపై ఆయ‌న తీవ్రంగా మండిపడ్డారు. శనివారం గాంధీభవన్​లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రభుత్వం మరోసారి రెడీ అయిందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ లక్ష ఇళ్లను బూచీగా చూపుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, త‌ల‌సాని శ్రీనివాస‌ యాద‌వ్ డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లపై పలు సంద‌ర్భాల్లో మాట్లాడిన మాటలను భట్టి మీడియాకు చూపించారు.

ఇప్పటివరకు గ్రేటర్ లో నాలుగువేల ఇళ్లను కూడా కట్టలేదన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 96వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు క‌ట్టాల్సి ఉండ‌గా, కేవ‌లం 3,428 మాత్రమే క‌ట్టార‌ని తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. గ్రేట‌ర్ పరిధిలోని జియాగూడ‌, గోడెకీ ఖ‌బ‌ర్‌, కట్టెల మండి, ఇందిరాగాంధీ కాల‌నీ, బ‌న్సీలాల్ పేట్ ప్రాంతాల్లో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చూపించింది కేవ‌లం 3,428 ఇళ్లు మాత్రమేనని అన్నారు.

మ‌రుస‌టి రోజు గ్రేట‌ర్ లో ఇళ్లు చూపిస్తామ‌ని చెప్పి రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో 2016 ఇళ్లను చూపించారని అన్నారు. మేడ్చల్​ జిల్లా నాగారంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అంబేద్కర్​ బ‌స్తీలో 150 కుటుంబాల‌ను ఖాళీ చేయించి ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసి నాలుగేళ్లు అవుతున్నా.. వాటికి దిక్కుమొక్కూలేద‌ని భ‌ట్టి విమర్శించారు. గ‌తంలో వ‌రంగ‌ల్ ప‌ట్టణంలోనూ డ‌బుల్ బెడ్ రూమ్​ ఇళ్ల వ్యవహారంలోనూ సీఎం కేసీఆర్​ ఇలాగే వ్యవహరించారని గుర్తుచేశారు. సమావేశంలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, మాజీ ఎంపీలు అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, వి.హ‌నుమంత‌రావు, దాసోజు శ్రవణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్‌, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బ‌ల్మూరి వెంక‌ట్, ఎస్సీ సెల్ చైర్మన్ ​నాగ‌రిగారి ప్రీత‌మ్, నాంపల్లి నాయ‌కులు ఫిరోజ్ ఖాన్‌ పాల్గొన్నారు.