Breaking News

రైతులపై డీజిల్‌ పిడుగు

రైతులపై డీజిల్‌ పిడుగు

సారథి న్యూస్​, హైదరాబాద్​: పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది. వ్యవసాయంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం భారీగా పెరిగి పోయింది. సాగు పనులకు కూలీల కొరత వేధిస్తుండడంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికొచ్చే వరకు కీలకంగా మారాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా డీజిల్‌ ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. దీంతో ఎరువులు, రవాణా చార్జీలపైనా ప్రభావం పడింది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది.
ట్రాక్టర్లు, యంత్రాలే ఆధారం
ప్రస్తుతం ఎద్దులు, నాగళ్ల వాడకం క్రమంగా తగ్గిపోయి ఆ స్థానంలో యంత్రాల వినియోగం తప్పనిసరిగా మారింది. ఎద్దులతో వ్యవసాయం చేసే రైతులను ప్రస్తుతం వేళ్లమీద లెక్కించవచ్చు. ఇప్పుడంతా ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు దర్శనమిస్తున్నాయి. పెద్ద రైతులు సొంతంగా కొనుగోలు చేస్తుండగా చిన్న, సన్నకారు రైతులు అద్దెవాటిపై ఆధార పడుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు వంటి పథకాలతో అన్నదాతలకు చేదోడుగా నిలుస్తున్నా కష్టాలు తప్పడం లేదు. ఏటా సాగు వ్యయం పెరుగుతోంది. వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పనులు జోరందుకునే సమయంలోనే డీజిల్‌ ధరలు అమాంతం పెరగడంతో రైతుకు అదనపు భారంగా మారింది.
పెరిగిన పెట్టుబడి ఖర్చు
మూడు వారాలుగా డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతో ట్రాక్టర్ల యజమానులు రేట్లు పెంచేశారు. సొంత ట్రాక్టర్లు కలిగిన రైతులు సొంత భూముల్లో పని పూర్తయిన అనంతరం ఇతర రైతుల భూముల్లో దుక్కులు చేస్తుంటారు. స్థానిక పరిస్థితులను బట్టి డీజిల్‌ ధరల ఆధారంగా సీజన్ల వారీగా దుక్కులు దున్నేందుకు రేట్లను ఖరారు చేస్తుంటారు. మెట్ట పంటలకు పొడి దుక్కి, వరి పొలంలో కేజ్‌వీల్‌ దుక్కికి వేర్వేరుగా ధరలు నిర్ణయిస్తారు. పొడి దుక్కికి ట్రాక్టర్‌ కిరాయి గంటకు రూ.700 నుంచి రూ.800 తీసుకుంటారు. అదే కేజ్‌వీల్‌తో కరిగెటలో దున్నడానికి గంటకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 కిరాయి తీసుకుంటారు. డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ట్రాక్టర్‌ కిరాయిలు అదనంగా గంటకు రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగాయని రైతులు చెబుతున్నారు.
పెట్రోల్‌ను దాటిన డీజిల్‌ ధర
గత నెల ప్రారంభంలో డీజిల్‌ ధర లీటరుకు రూ.67.82 ఉండగా, రూ.79.79కి చేరింది. గతనెల ఏడో తేదీ నుంచి 21 రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ.11 పెరగడం గమనార్హం. డీజిల్‌ ధరలు పెరగడం తదనుగుణంగా ట్రాక్టర్ల కిరాయి రూపంలో అదనపు భారం పడనుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాల నిర్వహణకు ముందస్తుగా పెట్టుబడి పెట్టే యజమానులు ఆ భారాన్ని రైతులపై మోపుతున్నారు. పొలం పనులకు ట్రాక్టర్‌ గంటకు మూడు నుంచి మూడున్నర లీటర్ల డీజిల్‌ వినియోగమవుతుంది. ఈ లెక్కన రోజుకు 8 గంటలు వినియోగించినా రోజుకు 28 లీటర్లకు రూ.11 చొప్పున అధికం అంటే రోజుకు రూ.308 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. దీనికి అదనంగా పంట ఉత్పత్తుల రవాణాకు పెంచే ధరలు మరింత భారం కానున్నాయి.