- రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు
- మహారాష్ట్రలో 9 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వారంలో మొదటి రెండ్రోజుల్లో 80వేల లోపు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధవారం నుంచి మళ్లీ 95వేలు దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్‌లో సుమారు రెండు లక్షల (1,93,134) మంది మహమ్మారి బారిన పడ్డారు. తాజా లెక్కలతో దేశంలో కరోనా వచ్చినవారి సంఖ్య 44 లక్షలు(44,65,864) దాటింది. ఇందులో 9 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉండగా, 34 లక్షల మందికిపైగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 1,172 మంది మరణించారు. దీంతో కరోనా ప్రబలి మరణించినవారి సంఖ్య 75,062కు చేరింది. మహారాష్ట్రలో వైరస్ పంజా విసురుతోంది. బుధవారం ఇక్కడ 23,816 కేసులు నమోదవగా.. మొత్తం కేసులు 9 లక్షలు దాటాయి. ఇందులో 27,787 మంది చనిపోయారు. బుధవారం వచ్చిన కొత్త కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 5,27,512కు చేరాయి. దేశంలో ఇప్పటిదాకా 5కోట్ల మందికి పైగా టెస్టులు నిర్వహించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.