Breaking News

మే 29 దాకా లాక్​ డౌన్​

తెలంగాణలో కరోనా తగ్గింది

రెడ్​ జోన్లలో అన్ని బంద్

మే నెలలోనే టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్

రేపటి నుంచి ఇంటర్​ వాల్యూయేషన్​

ఆటోలు ఓకే, ఆర్టీసీ బస్సులు నడవవ్​

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో కరోనా(కోవిడ్​–19) వ్యాప్తి నేపథ్యంలో లాక్​ డౌన్​ ను మే 29 వరకు పొడగించనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. 27 జిల్లాల్లో అన్ని సడలింపులు ఇస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. కొద్ది రోజులు ఓపిక పడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో 1096 కు కరోనా బాధితులు చేరారని, ఇవాళ కొత్తగా 11 మందికి పాజిటివ్ వచ్చిందని, 43 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్​లోని ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కరోనా నుంచి బయటపడడంతో కరీంనగర్​ దేశానికే రోల్​ మోడల్​గా నిలిచిందని, సింగిల్​ డెత్​ లేకుండా కాపాడుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశామన్నారు. భారత్ బయోటెక్, బీఈ, శాంతాబయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలు సాగిస్తున్నాయని తెలిపారు.

జీహెచ్​ఎంసీ నుంచే కేసులు

రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయని, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని, 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని వెల్లడించారు. కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్నాయని సీఎం కేసీఆర్​ తెలిపారు. రెడ్ జోన్లలో 66శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఇక్కడ ఎలాంటి సడలింపులు ఉండబోవని స్పష్టంచేశారు. రాత్రిపూట కఠినమైన కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో పీపీఈ కిట్లు తక్కువగా ఉన్నాయన్నారు. 10లక్షల కిట్లకు ఆర్డర్​ ఇచ్చామన్నారు. రెడ్ జోన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులు తెరవడానికి వీల్లేదన్నారు. వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయని, నిర్మాణ వ్యవసాయ సంబంధిత షాపులు తీయడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కరోనా పరిస్థితిపై ఈనెల 15వ తేదీన సమీక్ష నిర్వహించి సడలింపులపై చర్చిస్తామన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని షాపులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకోవచ్చన్నారు. భౌతిక దూరం పాటించకపోతే వాటిని కూడా క్లోస్​ చేస్తామన్నారు. మున్సిపల్ పట్టణాల్లో 50శాతం షాపులు తెరుస్తారని, లాటరీ సిస్టం ద్వారా షాపులు తెరుచుకోవచ్చన్నారు. కమిషనర్లు ఆర్డర్లు ఇస్తారని సీఎం కేసీఆర్​ చెప్పారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పనిచేస్తాయని, యథాతధంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుకోవచ్చన్నారు.   ఇసుక మైనింగ్ కూడా కొనసాగుతుందని, వాహనాల రిజిస్ట్రేషన్లు యథాతధంగా పనిచేస్తాయని అన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మండల కేంద్రాలు, గ్రామాల్లో సడలింపులు ఉంటాయన్నారు. 65 ఏళ్లు దాటినవారు బయటకు రాకుండా చూడాలన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందన్నారు. రాత్రి 7 గంటల తర్వాత బయటకు వస్తే పోలీస్‌ చర్యలు తప్పవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కంటైన్​ మెంట్​ జోన్లు ఉంటే ఒక్క హైదరాబాద్‌లోనే 19 కంటైన్​ మెంట్​ జోన్లు ఉన్నాయన్నారు. మిగతా 16 ఇతర రెడ్‌ జోన్‌ జిల్లాలో ఉన్నట్లు చెప్పారు. ఈ రోజుకు కంటైన్​ మెంట్​ జోన్లు 12 మాత్రమే మిగిలాయన్నారు. 23 కంటైన్​ మెంట్​ జోన్ల గడువు తీరిందన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఇక్కడ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల్లో 726 కేసులు ఇక్కడే నమోదైనట్లు తెలిపారు. ఇక్కడ కమ్యూనిటీ వ్యాప్తి ఆస్కారం ఎక్కువ కాబట్టి ముంబై దుస్థితి మనకు రావొద్దని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. 

మేలోనే టెన్త్​ ఎగ్జామ్స్​

కోర్టు నిబంధనల మేరకే ఒక్కో సెంటర్​ లో తక్కువ మంది విద్యార్థులతో మే నెలలోనే టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అలాగే రేపటి నుంచే ఇంటర్​మీడియట్​ వ్యాల్యూయేషన్​ కొనసాగుతుందని చెప్పారు. యువ న్యాయవాదులకు సాయం చేసేందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే లాయర్లకు కు రూ.15 కోట్లు రిలీజ్ చేసి, సీజే ద్వారా అర్హులైన వారిని ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది వలస కార్మికులకు వసతులు కల్పించామన్నారు. వారిని తమ రాష్ట్రాలకు వెళ్తామంటే పంపిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడువేలకుపైగా సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు

 తెలంగాణలో ఉండేది రైతురాజ్యం.. చిల్లర రాజకీయం కాదన్నారు.  రైతులకు ఉచిత కరెంట్​ ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. కేసీఆర్​ బతికి ఉన్నంత వరకు రైతుబంధు కొనసాగుతుందన్నారు. రైతు రుణమాఫీ కోసం రేపే రూ.1200 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. రూ.25వేల లోపు ఉన్నవారికి మాఫీ చేస్తామన్నారు.

ఆర్టీసీ బస్సులు నడవవ్​

ఆటో, క్యాబ్​ లు గ్రీన్ జోన్లలో నడుస్తాయని, ఈనెల 15న పరిస్థితిని బట్టి ఆర్టీసీ బస్సులపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆఫీసులు 1/3 పనిచేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆఫీసులు పూర్తిగా నడుస్తాయన్నారు.

సీఎం ప్రకటించిన జోన్లు

రెడ్‌ జోన్ జిల్లాలు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు

నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల

గ్రీన్‌ జోన్ జిల్లాలు

పెద్దపెల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి