Breaking News

మెతుకుసీమలో కరోనా హైరానా

మెతుకుసీమలో కరోనా హైరానా

  • మెదక్ ​జిల్లాలో అన్ని మండలాలకు వ్యాప్తి
  • ప్రజల్లో తీవ్ర భయాందోళన
  • 272 మందికి పాజిటివ్
  • ఇప్పటికే 12 మంది మృతి

సారథి న్యూస్, మెదక్: మెతుకు సీమను కరోనా వణికిస్తోంది.. మెదక్ జిల్లాలో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గత జూన్ లో జిల్లాలోని కొన్ని పట్టణాల్లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, జూలై నెలలో క్రమంగా జిల్లాలోని అన్ని మండలాలకు వ్యాపించాయి. పాజిటివ్ కేసుల సంఖ్య వందకు చేరడం, మరణాల సంఖ్య పది దాటడంతో జిల్లావాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ.. కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ –19 పాజిటివ్​కేసులు 272 నమోదు కావడం గమనార్హం. వందమంది రికవరీ కాగా, 148 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మిగతా వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
12 మంది మృతి
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా 12 మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా మరో నలుగురు మృతిచెందారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నలుగురు కరోనాకు బలయ్యారు. తూప్రాన్​లో ఇద్దరు చనిపోయారు. శివ్వంపేట, నార్సింగి, కొల్చారం, టెక్మాల్, చేగుంట మండలాల్లో కరోనా మరణాలు సంభవించాయి.
పోలీసులకూ వైరస్
జిల్లాలో పలువురు పోలీసులకు కరోనా వైరస్ ప్రబలింది. పట్టణానికి చెందిన ఓ ఎస్సైతోపాటు అతని కుటుంబ సభ్యులు ముగ్గురు, జిల్లా పోలీస్ ఆఫీసులో పనిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్, టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్లు, హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఓ కానిస్టేబుల్, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసే మరో నలుగురు పోలీసులకు కోరనా మహమ్మారి అంటుకుంది. దీంతో పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది.