Breaking News

మక్కపంటకు విరామమే మంచిది

మక్కపంటకు విరామమే మంచిది

  • వ్యవసాయ శాఖ.. ఇక డైనమిక్ డిపార్ట్​మెంట్
  • తెలంగాణ ఏం తింటున్నదో అవే పంటలు సాగుచేయించాలి
  • వచ్చే ఏడాది నుంచి రైతులకు ‘అగ్రికల్చర్ కార్డులు’
  • వ్యవసాయ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీచేయండి
  • ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు

సారథి న్యూస్, హైదరాబాద్: రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదల, సమన్వయంతో పనిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ ఇకనుంచి సాదాసీదా డిపార్ట్​మెంట్​కాదని, చాలా డైనమిక్ డిపార్ట్​మెంట్​గా మారబోతుందని వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఎవరికి తోచినట్టు వారు కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, పై అధికారుల ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు. మంగళవారం ప్రగతి భవన్ లో అన్నిజిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

మక్కపంట వేస్తే నష్టమే
మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని, క్వింటాలుకు రూ.800, రూ.900కు మించి ధర పలకడం కష్టమేనని అన్నారు. ఈ నేపథ్యంలో అదే ధరకు అమ్ముకోదలచిన రైతులు మాత్రమే మక్కపంట వేసుకోవాలనే విషయాన్ని మరింతగా అర్థం చేయించాలని సూచించారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర రాదు అని తేల్చిచెప్పండి. ఇందులో మొహమాటానికి పోయి సగం సగం సమాచారం ఇవ్వడం ద్వారా రైతు మొక్కజొన్న పంటవేసి నష్టపోయే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్​సూచించారు. నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్​తో పాటు కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు కూడా అందుతున్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర విభజన సమయానికి కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వసామర్థ్యం కలిగిన గోదాములను తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం మామూలు విషయం కాదన్నారు.

లాభసాటిగా వ్యవసాయం
గతంలో ‘వ్యవసాయం చేసుడు కన్నా పాన్ డబ్బా నడుపుకునుడు నయం’ అనే సామెత ఉండేదని, కానీ ఇప్పుడు వ్యవసాయమే లాభసాటి వ్యాపారంగా మారిందన్నారు. గతంలో వ్యవసాయం చేసే యువకుడికి పిల్లనివ్వాలంటే ఇష్టపడేవారు కాదని, నేడు ఐటీ రంగంలో ఉన్నతస్థాయిలో జీతాలు తీసుకునే యువతీ యువకులు సైతం వ్యవసాయం బాటపట్టారని సీఎం కేసీఆర్​గుర్తుచేశారు. ఒడిశా ప్రభుత్వం ‘కాలియా’ పేరుతో తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనముందే విలేకరులకు చెప్పడం గర్వకారణంగా ఉందన్నారు.

గుజరాత్ వ్యాపారులు మన పత్తిని కొంటున్నరు
‘దేవుడు తెలంగాణకు మంచి నేలలను ఇచ్చిండు. ప్రపంచానికే విత్తనాలను అమ్ముతున్న రాష్ట్రంగా ఎదుగుతున్నది. గుజరాత్ వ్యాపారులు వాళ్ల రాష్ట్రంలో పండే పత్తిని పక్కన పెట్టి, తెలంగాణ పత్తిని కొంటున్నరు. తెలంగాణ సోనారకం వరిబియ్యాన్ని డయాబెటిక్ రోగులు తినవచ్చని, అమెరికా శాస్త్రవేత్తలు పరిశీలించి అక్కడి పత్రికల్లో ప్రచురించారని’ సీఎం వివరించారు. తెలంగాణ ఏమి తింటుందో.. మార్కెట్లో ఏ పంటకు ధర వస్తుందో తెలుసుకుని అందుకు అనుగుణంగా పంటలను పండించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడం, సరైన సమయంలో ఎరువులు అందించడం, రైతు పండించిన పంటకు మంచి ధరలు లభించేలా చూడడం.. వ్యవసాయ అధికారులపైనే ఉందని సీఎం వివరించారు. ఏ పంట వేయాలి.. ఏ పంట వేయకూడదు అనే విధానాలను రూపొందించి ‘డూస్ అండ్ డోంట్ డూస్‘ గురించి వివరిస్తూ వచ్చే ఏడాది నుంచే ‘అగ్రికల్చర్ కార్డు’ ను రూపొందించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలన్నారు.

శాఖాపరమైన ఖాళీ పోస్టులను భర్తీచేయాలి
వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘తక్షణమే వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీలను చేపట్టండి. ప్రమోషన్లు పెండింగ్​లో ఉంటే వెంటనే ఇచ్చేయండి. భార్యాభర్తలు ఇద్ధరూ ఉద్యోగులే అయితే ఒకే చోట పనిచేసేలా వారికి అవకాశాలు కల్పిస్తూ బదిలీచేసే దిశగా ఉత్తర్వులు సిద్ధం చేయండి..’ అని ఆదేశించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవంగా సత్కరించి ఇంటికి సాగనంపాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బాల్క సుమన్, కంచెర్ల భూపాల్ రెడ్డి, శంకర్ నాయక్, చిరుమర్తి లింగయ్య, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, అగ్రికల్చర్ యూనివర్శిటీ వీసీ ప్రవీణ్ రావు, హార్టికల్చర్ ఎండీ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అన్ని జిల్లాల డీఏవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.