లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ సామూహికల లైంగికదాడి ఘటన విషయంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆజాద్ తో పాటు మరో 400 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి పేర్లను వెల్లడించలేదు. హత్రాస్ బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం తన అనుచరులతో కలిసి వెళ్లిన ఆజాద్… బూల్గర్హి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో వచ్చిన ఆయన్ను.. పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలి గ్రామానికి వెళ్లడానికి అనుమతి లేదని వారించారు. కానీ కొద్దిసేపటి వాగ్వాదం తర్వాత.. ఆజాద్ కు అనుమతి మంజూరు చేశారు. అయితే, 144 సెక్షన్ నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఆజాద్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ర్యాలీలో పాల్గొన్నవారి పైనా కేసులు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని గుర్తించాల్సి ఉంది. హత్రాస్ దళిత యువతి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం ఆజాద్ మాట్లాడుతూ… ఆ కుటుంబానికి వై కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. వారికి ప్రాణహాని ఉందని ఆజాద్ ఆరోపించారు.