తెలంగాణ రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది తీరాన ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం ఆంజనేయస్వామి. వ్యాసరాయుల వారి ప్రతిష్ఠాపన అయిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితం. పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న ఈ పుణ్యస్థలంలో ఎంతో మంది మహాపురుషులు, యోగులు, రుషులు తపమాచరించిన దివ్యధామంగా వెలుగొందుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ ఆంజనేయస్వామి ప్రధాన దైవంగా దర్శనమిస్తారు.
ప్రతిష్ఠించిన వ్యాసరాయలు
ఆంజనేయస్వామి వారిని శ్రీకృష్ణదేవరాయల గురువైన శ్రీవ్యాసరాయలు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెపుతోంది. 16వ శతాబ్దం నుంచి ప్రసిద్ధమైన ఈ స్వామివారిని అనంతర కాలంలో వచ్చిన రాజులు, సంస్థానాధీశులు సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత గద్వాల సంస్థానాధీశులు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేవారట. శ్రీకృష్ణదేవరాయల గురువైన శ్రీవ్యాసరాయల వారికి ఒక పవిత్రమైన నియమం ఉండేదట. అదేమిటంటే వీరు ప్రతిరోజు ఒక ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన చేయకపోతే నిద్రించేవారు కాదట. అంతే కాదు.. వీరు ప్రతిష్ఠించే ప్రతి ఆంజనేయ విగ్రహానికి ఇరువైపులా ‘మధ్వ సంప్రదాయ రీతిలో’ శంఖుచక్రాలు ఏర్పాటు చేసేవారట. ఆంజనేయుడి విగ్రహానికి కుడి, ఎడమల శంఖు చక్రాలుండడం శ్రీవ్యాసరాయల ప్రతిష్ఠాపనగా గుర్తించవచ్చు.
బోయవారి అనుగ్రహం
ఆలయ ప్రతిష్ఠాపన అనంతరం అదేరోజు అక్కడే నిద్రకు ఉపక్రమించిన శ్రీవ్యాసరాయల వారికి కలలో ఆంజనేయ స్వామి సాక్షాత్కరించి.. ప్రతిష్ఠాపన వరకు బాగానే ఉంది. మరి రేపటి నుంచి ప్రతిరోజు నాకు నిత్యార్చనలు జరిపే ఏర్పాట్లు ఏమిటని శ్రీవ్యాసరాయుల వారిని ప్రశ్నించారట. దీంతో శ్రీవ్యాసరాయల వారు మీరే సెలవివ్వమని కోరగా..‘రేపు ఉదయం నన్ను దర్శించుకోవడానికి ముందుగా ఎవరు ఇక్కడికి వస్తారో వారినే నాకు ప్రతిరోజు పూజలు చేయడానికి నియమించమని’ ఆదేశించారట. మరుసటి రోజు ఉదయం ముందుగా దర్శనానికి బీచుపల్లి అనే ఒక బోయ పశువుల కాపరి పశువులను మేపుకుంటూ అటుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడట. బోయ పశువుల కాపరినే పూజారిగా నియమించారట.
తొలి దర్శనం బోయవారిదే..
నాటి నుంచి నేటి దాకా ఆలయ ప్రవేశద్వారం గుండా తొలి దర్శనం.. తొలి అభిషేకభాగ్యం బోయ కులస్తులకే దక్కింది. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది అందువల్లనే క్రమంగా ఇక్కడి ఆంజనేయుడికి బీచుపల్లి రాయుడు అనే పేరు వచ్చింది. వారి తర్వాత మధ్వ సంప్రదాయ ప్రకారం మధ్వలు(బ్రాహ్మణులు) మంత్రయుక్తంగా ద్వితీయ పూజలు చేస్తారు. అంతేకాదు ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల వారికి చాలా మందికి బీచుపల్లి అని పేర్లు ఉండడం గమనార్హం.
విభిన్నం.. విశిష్టం
ఈ ఆలయంలోని ముఖమండపంలో శ్రీస్వామివారికి కుడివైపున ఉన్న చిన్నవేదిక మీద భవానీమాత, శివలింగం, విఘ్నేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. కుడివైపున ఉన్న చిన్నవేదిక మీద శ్రీస్వామివారి పాదుకలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయానికి ప్రధాన గాలి గోపురం (రాజగోపురం)అందంగా నిర్మించారు. దానిముందు రాతి ధ్వజస్థంభం, దానిపై అందమైన ఆంజనేయుడి రూపం గంగ సింధూరంతో కప్పి ఉంటాయి. ధ్వజస్థంభానికి కుడివైపు కూడా స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి.
ప్రతిరోజు మంగళవాయిద్యాలతో అక్కడే కూత వేటు దూరంలో ఉన్న కృష్ణానది పుణ్యజలాలతో స్వామివారిని అభిషేకిస్తారు. భక్తులు పర్వదినాలు, పుష్కర సమయాలు, కార్తీక మాసంలోనూ స్నానాలకు పెద్ద సంఖ్యలో వస్తారు. నదిలోకి పుష్కర స్నానఘట్టాలను నిర్మించారు. ఇక్కడొక శివాలయం కూడా ఉంది కృష్ణానదికి నిండుగా నీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న శివలింగం మీద నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ 1992లో ఒక రామాలయాన్ని కూడా నిర్మించారు. వైష్ణవ సంప్రదాయంలో ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
హైవేకు పక్కన..కృష్ణమ్మ చెంతనే
హైదరాబాద్– బెంగళూరు హైవేకు పక్కనే ఉండడతో భక్తులు చేరుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 170 కి.మీ దూరంలోనూ, జూరాల ప్రాజక్టు నుంచి 30 కి.మీ దూరంలో బీచుపల్లిక్షేత్రం ఉంది. పితృకార్యక్రమాలు, పిండ ప్రదానాలకు, అస్తికలు నిమజ్జనం చేసేందుకు అధిక మెత్తంలో భక్తులు వస్తుంటారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రలు. వసతి గదులు, కల్యాణ మండపాలు కూడా యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయాలు దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఆలయాన్ని దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు.
:: దిండిగల్ ఆనంద్‌శర్మ,
సీనియర్ జర్నలిస్టు, 96660 06418