సారథి న్యూస్, హైదరాబాద్ : రాజస్థాన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకప్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు.
దేశంలో బీజేపీ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆడుతోంది. దేశంలో కరోనా వ్యాధి విజృంభించి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే బీజేపీ అప్రజాస్వామిక రాజకీయం చేస్తోందన్నారు. మొన్న కర్ణాటక, నిన్న మధ్యప్రదేశ్, ఇవాళ రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కుట్రలు చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోందన్నారు. బీజేపీ కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొట్టేందుకు దేశ వ్యాప్తంగా నిరసన తెలపాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. రాజ్‌భవన్ వద్ద ఆందోళన ను విజయవంతం చేయాలని ఉత్తమ్‌కుమార్ కోరారు.