కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యను ఆ పార్టీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయమై ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బుధవారం లేఖ రాశారు. బీజేపీ ప్రతినిధుల బృందం మిమ్మల్ని కలిసి వాస్తవాలను వక్రీకరించి చెప్పారని, ఆ విషయమై మీకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయంపై రాస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. ‘ఎమ్మెల్యే తరచూ ప్రజలను కలిసే మొబైల్ షాప్ దగ్గర ఉరి వేసుకుని కనిపించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సూసైడ్‌గా తెలిసింది. ఆర్థిక లావాదేవీల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన జేబులో కూడా ఒక లేఖ దొరికింది. కానీ బీజేపీ కావాలని రాజకీయ కోణంలో చూస్తోంది’ అని మమతా ఆ లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఓ దుకాణం ముందు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కాగా సదరు ఎమ్మెల్యేను హత్యచేశారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలో బంద్ కూడా నిర్వహించారు. ఈ మేరకు దానిపై విచారణ జరపాలని కోరుతూ బీజేపీ బృందం రాష్ట్రపతిని కలిసింది.