Breaking News

బావ ప్లాన్​.. మరదలు అప్లై

సారథి న్యూస్​, హైదరాబాద్‌: నడిపేది ట్రాలీ ఆటో.. జీవన శైలిలో విలాసవంతమైన మార్పు. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి చేరిక.. 2.35 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు.. ఇదంతా ఎలా సాధ్యమంటూ ఆరా తీస్తే.. అసలు సంగతి తెలిసి ఔరా అంటూ ఎల్బీనగర్‌ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. మరదలితో చోరీ చేయించి.. ఆ డబ్బుతో జల్సా చేస్తున్న బావ ఆట కట్టించారు. రూ.25.5 లక్షలు, రూ.22 లక్షల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ కృషినగర్‌లోని ఇంట్లో ఓ బాలిక 2015-2019 వరకు పని చేసింది. 2018 మే 16న లాకర్‌ నుంచి రూ.59 లక్షలు మాయమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పని అమ్మాయితో పాటు తరచూ ఆమె దగ్గరికొచ్చే బంధువుపైన అనుమానం ఉందంటూ పేర్కొన్నారు. దీంతో వారిపై ఓ కన్నేసి ఉంచారు. మూడు, నాలుగు నెలల కింద ఆ అమ్మాయి బావ మహబూబాబాద్‌ జిల్లా కుర్వి మండలం ఘాజా తండాకు చెందిన ధరావత్‌ కుమార్‌(32) జాడ చిక్కింది. అప్పటి నుంచి అతనిపై నిఘా ఉంచారు. లాకర్‌ నుంచి డబ్బులను ఆ అమ్మాయే దొంగిలించినట్లు విచారణలో తేలింది. అందులో రూ.25వేలు తన వద్ద ఉంచుకుని మిగిలిన డబ్బులను ఇంటి బయట వేచి చూస్తున్న కుమార్‌కు ఇచ్చినట్లు గుర్తించారు. ఆ డబ్బులతోనే కుమార్‌ బలపాల గ్రామంలో రూ.2.35 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. రూ.22.57 లక్షలను బంధువులు, స్నేహితులకు అప్పుగా ఇచ్చాడు. రూ.11.24 లక్షలను విలాసాలకు ఖర్చు చేశాడు. బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను అరెస్ట్‌ చేయాల్సి ఉంది. కేసును ఛేదించిన ఎల్బీనగర్‌ సీఐ వి.ఆశోక్‌రెడ్డి, డీఐ కృష్ణమోహన్‌ను సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు.