Breaking News

‘ఫస్ట్​బెల్’ కొట్టిన కేరళ

ఫస్ట్​ బెల్​ కొట్టిన కేరళ

యావత్ ప్రపంచంలోని ప్రజలంతా కరీనా మహమ్మారి బారి నుంచి ఏవిధంగా తప్పించుకోవాలా అనే సంశయ స్థితిలో ఉంటూ వారిలో అనేక మంది స్వీయ నియంత్రణను పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దీని విషవలయంలో పడని దేశాలను మనం వేళ్లపై లెక్కించవచ్చు. ఈ విధంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పలు దేశాలు తమ విద్యార్థులకు విద్యను ఏవిధంగా అందించాలనే విషయంలో కానీ విద్యాలయాలను ఎప్పుడు కచ్చితంగా నూతన విద్యాసంవత్సరంతో ప్రారంభించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డాయి. దీనితో సమయానికి ప్రారంభం కావలసిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని దిక్కుతోచని పరిస్థితిలో చాలా మంది విద్యార్థులు నేడు ఉన్నారు. తమ అత్యంత విలువైన విద్యాసంవత్సరాన్ని ఎంతవరకు నష్టపోవాలా? అని మరికొందరు వాపోతున్నారు.

భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితే దాపురించింది. అటు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నడిచే కేంద్ర సర్కారు గాని, లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గాని నష్టపోతున్న ఈ విద్యాసంవత్సరాన్ని ఎలా పూరించాలనే ఆలోచనలకు ఇంతవరకు శ్రీకారం చుట్టలేకపోయాయి. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో దేశంలోనే అత్యధిక అక్షరాస్యతను సాధించిన రాష్ట్రంగా, నూతన ప్రయోగాలకు ఎల్లప్పుడూ ఆద్యుడై సత్ఫాలితాలు సాధించడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం నేడు ధనిక, పేద తారతమ్యం లేకుండా ఆ రాష్ట్ర విద్యార్థులందరికీ ఆన్ లైన్ విద్యను అందించే దిశలో భాగంగా ‘ఫస్ట్ బెల్’ అనే ఒక నూతన విధానం ద్వారా చదువులు చెప్పించడం యావత్ దేశం గర్వించదగ్గ విషయం.
ఫస్ట్​బెల్.. ఆదర్శం
కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్​అయ్యాయి. మార్చి నుంచి విద్యార్థులు పుస్తకాల వంక చూడడమే మానేశారు. ప్రభుత్వాలు కూడా ఈ ఏడాది పరీక్షలను రద్దుచేసి, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఫలితాలను విడుదల చేస్తున్నాయి. అయితే విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కేరళ మాత్రం ఆన్​లైన్​ స్కూలింగ్​పై దృష్టిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ‘ఫస్ట్​బెల్’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మోడల్​దేశానికే ఆదర్శంగా నిలిచింది.
సరికొత్త విద్యావిధానం
అడ్మిషన్లు, కొత్త పుస్తకాల కొనుగోళ్లు, కొత్త యూనిఫామ్​లతో స్కూళ్లకు పరుగులు.. సాధారణంగా ఏటా జూన్​లో కనిపించే దృశ్యాలివి. జూన్​గడిచిపోయింది. జులై వచ్చింది. అయినా ఏ విద్యాసంస్థలోనూ ప్రవేశాల సందడి కనిపించడంలేదు. అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియడంలేదు. కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరాన్ని నిర్ణీత సమయానికి ప్రారంభించడంకన్నా ప్రజారోగ్య పరిరక్షణే ముఖ్యమని భావించాయి. ఫలితంగా దేశంలోని విద్యాసంస్థలన్నీ అనేక నెలలుగా మూతపడే ఉన్నాయి. కేరళలోనూ అంతే. ఒక్క పాఠశాల కూడా తెరుచుకోలేదు.

కానీ అక్కడ విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అక్కడి పిల్లలు చాలా రోజుల క్రితమే సెలవులకు స్వస్తి పలికి చదువుల్లో తలమునకలయ్యారు. ఇందుకు కారణం పినరై విజయన్ సర్కార్ ప్రారంభించిన ఆన్​లైన్​క్లాసుల విధానమే. ఫస్ట్​బెల్​కేరళ ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విద్యావిధానం. దీని సాయంతో విద్యార్థుల వద్దకే చదువును చేరుస్తున్నారు. జూన్​1న ఫస్ట్​బెల్​ పేరిట ఈ-తరగతులను ప్రారంభించింది కేరళ. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా విధానం అమలుచేయడం దేశంలో ఇదే తొలిసారి. కరోనా సమయంలో ఇలాంటి ప్రత్యామ్నాయ మోడల్​తో విద్యకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్రం కూడా ఇదే. ఇందులో అనేక మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. టీచర్లు కెమెరా ముందు పాఠాలు బోధిస్తుంటే పిల్లలేమో టీవీలు, ఫోన్లు, ల్యాప్​ట్యాప్​ల ముందు కూర్చొని ఎంచక్కా తరగతులు వింటున్నారు. అయితే ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేరళ సర్కారు అమలుచేస్తున్న గొప్ప కార్యాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ–విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేస్తే విద్యాసంవత్సరం వృథా కాకుండా ఉండడంతో పాటు భావిభారత పౌరులకు ఉజ్వలమైన భవిష్యత్​ను అందించిన వాళ్లమవుతాం. ఆ దిశగా పాలకులు కృషిచేస్తారని ఆశిద్దాం..

:: ప్రొఫెసర్ పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ),
హైదరాబాద్, సెల్​నం.96183 00450

One thought on “‘ఫస్ట్​బెల్’ కొట్టిన కేరళ”

  1. కొంత మందికి మాత్రమే అవకాశాలు వుంటాయి

Comments are closed.