Breaking News

ప‌దిరోజుల్లోనే 8ల‌క్షల కేసులు

ప‌దిరోజుల్లోనే 8 ల‌క్షల కేసులు

  • 24 గంట‌ల్లో 96,551 మందికి పాజిటివ్
  • 45 ల‌క్షలు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి నానాటికీ ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. ఈ నెల‌లో మొద‌టి ప‌దిరోజుల్లోనే (నిన్నటిదాకా) 8 ల‌క్షల కేసులు వచ్చాయంటే దేశంలో మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్రకారం గ‌త 24 గంట‌ల్లోనూ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 96,551గా నమోదైంది. తాజా కేసుల‌తో దేశంలో ఈ వైర‌స్ ప్రబలిన వారి సంఖ్య 45,62,414 కు చేరింది. గత 24 గంట‌ల్లో 1,209 మ‌ర‌ణించారు. ఇలా క‌రోనాతో దేశంలో 76,271 మంది చ‌నిపోయారు.
భ‌య‌పెడుతున్న గ‌ణాంకాలు
దేశంలో క‌రోనా కట్టడి కోసం సుదీర్ఘ లాక్‌డౌన్ విధించినా.. అది వైర‌స్ వ్యాప్తిని ఏమాత్రం ఆప‌క‌పోగా కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెండు నెల‌లుగా వైర‌స్ కోర‌లు చాస్తోంది. ప‌ట్టణాల్లో కొంత‌మేర త‌గ్గుద‌ల క‌నిపిస్తున్నా (ప్రభుత్వాలు విడుద‌ల చేస్తున్న గ‌ణాంకాల మేర‌కు).. ద్వితీయ, తృతీయ‌ స్థాయి న‌గ‌రాలు, మండ‌ల కేంద్రాలు, గ్రామాల్లో వైర‌స్ విజృంభ‌ణ వేగంగా ఉంది. ఇక ఆగ‌స్టు నుంచైతే వైర‌స్ ఉధృతికి పట్టప‌గ్గాల్లేకుండా పోతోంది. గ‌త‌నెల 1 నుంచి ప‌దిరోజుల్లో దేశంలో 5 ల‌క్షల పాజిటివ్ కేసులు రాగా.. ఈనెల ఆ సంఖ్య 8 ల‌క్షలు దాటింది. గ‌త‌నెల చివ‌రి వారంలోనే 6 ల‌క్షల కేసులు న‌మోదయ్యాయ‌ని గ‌ణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క‌రోనా కేసుల్లో మొద‌టిస్థానంలో ఉన్న యూఎస్ కంటే కూడా భార‌త్‌లోనే కేసులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. గ‌త‌రెండు వారాలుగా రోజూవారీ లెక్కలు చూసుకుంటే అమెరికా కంటే భార‌త్‌లో సుమారు 50వేల కేసులు అధికంగా న‌మోద‌వుతుండ‌డం అన్నింటికంటే ఆందోళ‌న‌క‌రంగా ఉంది.
తిర‌గ‌దోడుతుందా..?
ఇదిలాఉండ‌గా క‌రోనా బారిన ప‌డ్డా చాలా మంది కోలుకోవ‌డం శుభ‌ప‌రిణామ‌మే అయినా.. వారిలో రెండోసారి ల‌క్షణాలు క‌నిపించ‌డం ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు గ‌త‌నెల‌లో తొలిసారి క‌రోనా వచ్చినా ఆయ‌న త్వరగానే కోలుకున్నారు. కానీ కొద్దిరోజుల త‌ర్వాత ఆయ‌న తిరిగి అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విష‌యం విదిత‌మే. ఇక నాలుగురోజుల క్రితం బెంగ‌ళూరులోనూ ప‌లువురికి రెండోసారి వైర‌స్ వ‌చ్చిన‌ట్టు వార్తలు వ‌స్తుండ‌టంతో క‌రోనా వ‌చ్చినా రిక‌వ‌రీ అయిన‌వారు ఒకింత భ‌యంతో గ‌డుపుతున్నారు. అన్‌లాక్‌ల పేరిట దేశంలో అన్నింటినీ తెర‌వడం, ఆర్థిక మంద‌గ‌మ‌నం కార‌ణంగా వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటుండంతో జ‌న‌స‌మూహాలు ఎక్కువ‌ అవుతున్నాయి. ఫ‌లితంగా వైర‌స్ కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది.