Breaking News

ప్రాజెక్టులు కంప్లీట్ ​కావాలె

ప్రాజెక్టులు కంప్లీట్​కావాలె

  • గోదావరి నుంచి 4, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించాలి
  • సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు

సారథి న్యూస్, హైదరాబాద్: నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వాటికి నిధుల సమీకరణ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ‘ నీటి లభ్యత కలిగిన సమయంలో ప్రతిరోజు గోదావరి నుంచి నాలుగు టీఎంసీలు, కృష్ణా నుంచి మూడు టీఎంసీల నీటిని తరలించి రాష్ట్రంలోని కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. బడ్జెట్ నిధులతో పాటు వివిధ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆర్థిక సాయానికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటాను చెల్లించి, వెంటనే నిధుల సమీకరణ ప్రాసెస్ పూర్తిచేయాలి. వర్షాకాలం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలి’ అని సీఎం కేసీఆర్​సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.