Breaking News

ప్రభుత్వ నిర్ణయంపై పవన్​ ఫైర్​

రాజధాని మార్పు అప్రజాస్వామికం

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ విమర్శించారు. సీఎం జగన్​ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆదివారం జనసేన పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ ప్రతినిధులతో పవన్​ కల్యాణ్​ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అంతే కానీ రాజధానిని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానులు మార్చుకుంటే పోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. రాజధాని విషయంలో జనసేన పార్టీ విధానంలో ఏ మార్పు లేదని.. అమరావతి రాజధానిగా ఉండాలన్నదే తమపార్టీ అభిమతమని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. జనసేన అమరావతి రైతుల పక్షానే నిలబడుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్​ పేర్కొన్నారు.