సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడ ఉన్న ఆలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.
‘సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఎత్తైన భవనాలను కూల్చివేసే సందర్భంలో కొన్ని శిథిలాలు, పెచ్చులు దేవాలయం, మసీదులపై పడ్డాయి. దీనివల్ల వాటికి కొంత ఇబ్బంది కలిగింది. ఇది నాకు ఎంతో బాధ కలిగించింది. చాలా విచారకరం. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను. ప్రభుత్వ ఉద్దేశం పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం. అంతే తప్ప మసీదు, దేవాలయాలను చెడగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే కొత్తగా ఆలయం, మసీదులను ఎన్ని కోట్లయినా సరే వెచ్చించి, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా, సౌకర్యవంతంగా దేవాయలం, మసీదుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. నేనే స్వయంగా దేవాలయం, మసీదు నిర్వాహకులతో సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వం నిర్మాణాలను చేపడుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.