సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రజాగొంతుక మూగబోయింది. తన పాటలతో ఇరు రాష్ట్రాల ప్రజలను విప్లవోన్ముఖులను చేసిన ఓ తార నింగికెగిసింది. ప్రజాగాయకుడు, విప్లవకవి, ప్రజావాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్వగ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు 1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు. 1970లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజనుల ఉద్యమంలో ఆయన పాట తొలిసారి ప్రాచుర్యం పొందింది. ఉత్తరాంధ్ర జానపదాలను ఆయన విశ్వవ్యాప్తం చేశారు. ఓ దశలో ఆయన పాటలను ప్రజాకవి శ్రీశ్రీ సైతం మెచ్చుకున్నారు. ‘ఏంపిలడో ఎల్దుమొస్తువా.. ఏం పిల్లో ఎల్ధూ మొస్తవా, సికాకులంలో సీమలకొండకి.. ఏం పిలడో ఎల్దుమొస్తువా .. చిలకలు కత్తులు దులపరిస్తయట.. సాలూరవతల సవర్లకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. సెవల పిల్లులే శంఖమూదెనట ..తెలంగాణా కొమరయ్య కొండకి అంటూ’ అంటూ ఆయన గొంతెత్తి పాడితే యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన వెంట నడిచింది. కమ్యునిస్టుల ప్రతి ప్రజా ఉద్యమంలోనూ ఆయన గొంతు విప్లవ శంఖాన్ని పూరించేది. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంతో ఆయన వెలుగులోకివచ్చారు. ఆయన పాటలను ఇంగ్లీష్‌లోనూ తర్జూమా చేశారంటే వాటికి ఎంత ప్రాచుర్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన జననాట్యమండలి కోసం ఎన్నో పాటలు రచించి ఆలపించారు. గద్దర్ వంటి వారితో పనిచేశారు. సుమారు 400 పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. వంగపండు మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ సంతాపం తెలిపారు.
- August 4, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- GADDAR
- PRAJAKAVI
- SRIKAKULAM
- VANGAPANDU PRASADARAO
- ప్రజావాగ్గేయకారుడు
- వంగపండు ప్రసాదరావు
- శ్రీకాకుళం
- Comments Off on ప్రజాగొంతుక మూగబోయింది