- నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు
- తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి..
చెన్నై: ఆరుగాలం కష్టపడే రైతులకు పంటలు సాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘కొద్దిపాటి సాయం’ కూడా వారికి అందకుండాపోతోంది. నకిలీ లబ్ధిదారులను చూపిస్తూ పలువురు అధికారుల అండతో రైతులకు అందాల్సిన నగదును కూడా అవినీతి తిమింగళాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అన్నదాతలకు నగదు సాయం అందించే ‘పీఎం కిసాన్’ పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా..
నకిలీ రైతుల పేరుతో..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) కింద రైతులకు ఏటా రూ.6 వేలను(మూడు విడతలుగా) కేంద్రప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తమిళనాడులో ఈ నిధులు అసలు లబ్ధిదారులకు కాకుండా ‘నకిలీ రైతుల ఖాతాల’కు మళ్లాయి. సుమారు ఐదు లక్షల మంది నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.110 కోట్లు జమయ్యాయి. 13 జిల్లాల్లో ఈ కుంభకోణం జరిగినట్టు సమాచారం. కల్లకురిచి, విల్లుపురం, కాంచీపురం, రాణిపేట్, కృష్ణగిరి, కడలూర్, తిరువన్నమలై, సేలం, ధర్మపురి జిల్లాల్లో ఎక్కువ మంది నకిలీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని అధికారులు గుర్తించారు.
మండిపడుతున్న ప్రజాసంఘాలు
ఈ ఘటనపై రాజకీయ పక్షాలే గాక రైతు సంఘాలు, పలువురు సామాజిక కార్యకర్తలు పళినిస్వామి సర్కారును నిలదీస్తున్నారు. దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ కార్యదర్శి గగన్‌దీప్ సింగ్ బేడి రంగంలోకి దిగారు. ఇదే విషయమై బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 మంది ఉన్నతాధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించామని, 80 మంది సిబ్బందిపై వేటు వేశామని అన్నారు. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే కొంతమంది అవినీతి అధికారులు.. టెక్నాలజీని ఉపయోగించి రైతుల సొమ్మును కాజేశారని వివరించారు. నకిలీ లబ్ధిదారులను సృష్టించి ఆధార్ కార్డుల ద్వారా పీఎం కిసాన్ పైసలు వారి ఖాతాలలో జమచేసుకున్నారని తెలిపారు. ఇతర అధికార యంత్రాంగమంతా కోవిడ్ కట్టడిలో బిజీగా ఉన్న సమయంలో పలువురు అవినీతిపరులు ఈ పనిచేశారని ఆయన చెప్పారు. రాష్ట్ర పోలీసులు కూడా దీనిపై విచారణ చేస్తున్నారని, ఈ స్కాంలో నిందితులెవరైనా విడిచిపెట్టబోమని ఆయన స్పష్టంచేశారు. ఈ కేసులో ఇప్పటికే నకిలీ లబ్ధిదారుల నుంచి రూ.32 కోట్లను వసూలుచేశామని, మిగతా మొత్తాన్ని కూడా రికవరీ చేసుకుంటామని అన్నారు. అందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు.. బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని బేడి తెలిపారు.