Breaking News

పంట వివరాలు పక్కాగా

మెదక్​ జిల్లాలో వేగంగా

సారథిన్యూస్​, నిజాంపేట: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులు ఏయే పంటలు సాగుచేశారో పరిశీలిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటవివరాలు నమోదు చేసుకుంటున్నారు. మెదక్​ జిల్లాలోనూ ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. జిల్లాలో ఇప్పటికే 95 శాతం పంటనమోదు ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ పంటలను మార్కెట్​ చేసుకొనేందుకు ఇబ్బందులు పడకుండా ముందుగానే పంటవివరాలు నమోదు చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో రైతులకు గణనీయమైన దిగుబడి వచ్చినప్పటికీ .. మార్కెట్​లో సరైన ధర ఉండేది కాదు. ఈ నేపథ్యంలో నియంత్రిత సాగువల్ల రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉన్నది.

ప్రతి క్లస్టర్​కు ఓ ఏఈవో
రైతుల పంట వివరాలను నమోదు చేసేందుకు ప్రతి క్లస్టర్​కు ఓ ఏఈవోను నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట వివరాలను నమోదు చేయనున్నారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పడు ఆన్​లైన్​లో నమోదు చేస్తున్నారు. పంట నమోదు కార్యక్రమాన్ని మండలాల్లో ఏవోలు, డివిజన్​ స్థాయిలో ఏడీఏలు, జిల్లా స్థాయిలో డీఏవోలు పర్యవేక్షిస్తున్నారు.

మెదక్​ జిల్లాలో 95 శాతం పూర్తి
మెదక్ జిల్లాలో 2 లక్షల 20 వేల మంది రైతులు ఉన్నారు. ఈ వానకాలం లక్ష 90 వేల ఎకరాల్లో పంటలను సాగుచేస్తున్నారు. వీటిలో ఇప్పటికే లక్ష 40 వేల ఎకరాల్లో పంటల వివరాలను అధికారులు సేకరించారు. పట్టణాల్లో నివాసం ఉంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు ఏఈవోలకు ఫోన్​ చేసి తమ వివరాలను చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు.

విజయవంతంగా కొనసాగుతుంది
మెదక్​ జిల్లాలో పంట నమోదు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వ్యవసాయాధికారి పరుశురాం నాయక్​ పేర్కొన్నారు. ప్రతి సర్వే నంబర్​లోని ప్రతి గుంటను వ్యవసాయశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా వివరాలు నమోదు చేస్తున్నారని చెప్పారు. రైతులు వ్యవసాయాధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.