Breaking News

‘నైరుతి’ కురిసింది

సారథి న్యూస్, విజయనగరం: నైరుతి పవనం వచ్చేసింది.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా కేంద్రంలో భారీవర్షం కురిసింది. కొంతకాలంగా ఉదయం నుంచి విరుచుకుపడిన భానుడు ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకోగా మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు భారీవర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్పొరేషన్‌ ఆఫీసు జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తింది.

సిటీ సెంటర్​లో నిలిచిన వరద నీరు

సిటీ బస్టాండ్‌ రోడ్డు మోకాళ్లు లోతు నిండిపోగా, ప్రకాశం పార్కు రోడ్డు, కృష్ణా థియేటర్‌ రోడ్డులో వర్షపు నీరు పెద్దమొత్తంలో నిలిచింది. దీంతో ఆ ప్రాంతంలో పండ్లు విక్రయించే చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే నగర శివారులోని పద్మావతి నగర్‌, ధర్మపురి రోడ్డులో వరద నీరు పోటెత్తింది. నగరంలో ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చి చేరడంతో పద్మావతినగర్‌ వరదమయం అయ్యాయి.