సారథిన్యూస్, హైదరాబాద్: ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడా వరకు విదర్భ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తువద్ద కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఆది, సోమవారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
గ్రేటర్హైదరాబాద్లో కుండపోత
రుతుపవనాలకు తోడు ఉపరితలద్రోణి ప్రభావంతో గ్రేటర్‌వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రం వాతావరణం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాత్రి 10 గంటల వరకు నాంపల్లిలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో ఇదే రికార్డు. మెహిదీపట్నం, అత్తాపూర్, ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోనూ భారీవర్షం కురిసింది. వచ్చే మూడ్రోజులు గ్రేటర్‌వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.