కరోనా కాలం ఎవరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి పాలకుల దాకా పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పలువురు అధికారులతో పాటు ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ ప్రబలింది. అయితే, ప్రభుత్వం కొవిడ్ చికిత్సకు గాంధీ ఆస్పత్రిని కేటాయించింది. కరోనా రోగులందరికీ అక్కడే చికిత్స చేస్తున్నారు. అయితే, గాంధీలో సరైన సదుపాయాలు లేవని, కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదని, ఇక వైద్యం దైవాధీనం అని అనేకమంది కరోనా రోగులు తమ బాధలను ఫోన్ల ద్వారా వెల్లడిస్తున్నారు. అయితే, ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాత్రం గాంధీలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కానీ, వీరెవరూ అత్యాధునిక సేవలు అందిస్తున్నామని చెబుతున్న గాంధీ ఆసుపత్రిలో చేరలేదు. అంతా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చేరారు. దీనిపై తెలంగాణవాసులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనికి సరైన సమాధానం మాత్రం ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. అయితే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా కరోనా బారినపడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో ఆయన బుధవారం ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ తాను క్షేమంగా ఉన్నానని, కరోనా వచ్చినా ఎవరూ ఆందోళనకు గురికావద్దని, ఇక్కడ తనకు డాక్టర్లు మంచి చికిత్స చేస్తున్నారని సెలవిచ్చారు.
ఆ వీడియోను చూసిన జనం మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. గాంధీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా వారి మాటలు వినకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్ లక్షల రూపాయలు చికిత్సకు ఖర్చు పెడుతున్నారు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్లు పూర్తిస్థాయిలో చికిత్స చేయడం, సౌకర్యాలు కల్పించడంలో పెద్ద విచిత్రమేమీ లేదు. కానీ, గాంధీ ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితి ఉంటుందా..? ఆ విషయం ఎమ్మెల్యేకు తెలియదా..? ఒకవేళ గాంధీలో కూడా ఇలాంటి మంచి చికిత్స అందిస్తే ఆ ఎమ్మెల్యే గారు మరి లక్షల రూపాయలు పోసి ప్రైవేట్ ఆస్పత్రిలో ఎందుకు చేరారని తెలంగాణ వాసులు ప్రశ్నిస్తున్నారు. మంత్రిగారూ.. మీరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కాదు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని అక్కడ బాగా వైద్యసేవలు అందుతున్నాయని చెప్పండి అప్పుడు నమ్ముతాం మీ మాటలు.. అని తెలంగాణవాసులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి సలహా ఇస్తున్నారు.