- ప్రతి 5వేల ఎకరాలకు రైతువేదిక ఏర్పాటు
- హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ
- ప్రతిపక్షాల అసత్యప్రచారాలను నమ్మొద్దు
- రైతు ఆత్మీయ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
- జనగామ జిల్లా కొడగండ్లలో రైతువేదిక ప్రారంభం
సారథి న్యూస్, జనగామ: రైతు సంక్షేమమే ప్రధానధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా భూమిపై హక్కులకు సంపూర్ణ రక్షణ ఉంటుందన్నారు. శనివారం జనగామ జిల్లాలోని కడగండ్ల గ్రామంలో నిర్మించిన రైతు వేదిక నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు తమ సమస్యలను చర్చించేందుకే రైతు వేదికలను నిర్మించామని, రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్లు ఖర్చుచేసి 2,601 వీటిని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఐదువేల మంది రైతులతో నిర్మించిన ఆత్మీయ సమావేశంలో సీఎం ప్రసంగించారు. రైతులను సంఘటితం చేసి సాగులోని లాభనష్టాలను చర్చించుకునేందుకు, సాగులో వాడే పురుగు మందులు, మార్కెట్ లో డిమాండ్, పంటను క్రమపద్ధతిలో మార్కెట్ తరలించడం.. తదితర విషయాలను రైతు వేదికలో చర్చించనున్నట్లు తెలిపారు. రైతుబంధు సమితి అందించే పిలుపుతో పంట ధర నిర్ణయం కావాలని, మనం ఆశించిన ధర వస్తేనే పంటను విక్రయించాలని, ఆ దిశగా రైతు బంధు సమితి సభ్యులు పనిచేయాలని సూచించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం అన్నారు. రూ.26,800 కోట్లు ఖర్చుచేసి విద్యుత్ లైన్లు, నూతన సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుచేసి నాణ్యమైన త్రీ ఫేస్ విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు.
కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు
రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు రైతుఖాతాలో నేరుగా సుమారు రూ.28వేల కోట్లు జమచేశామని, కేసీఆర్బతికున్నంత వరకు రైతుబంధు పథకం ఆగదని సీఎం స్పష్టం చేశారు. తొలిదశలో రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశామని, మలిదశలో రూ.25వేలలోపు ఉన్న రైతుల రూ.1500 కోట్లు జమ చేశామని, మరో విడత రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఏటా రూ.1,200 కోట్లు ఖర్చుచేసి రైతుకు భద్రత కల్పించే దిశగా రైతుబీమా పథకం అమలు చేస్తున్నామని, ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు దిశగా రూ.ఐదులక్షలు అందిస్తున్నామని తెలిపారు.
ధరణితో భూహక్కులకు సంపూర్ణ రక్షణ
రైతులు ఎన్ని కష్టాలు ఎదురైనా భూమిని విక్రయించరని, తల్లిలా భూమిని కాపాడుకుంటారని సీఎం కేసీఆర్అన్నారు. భూ సమస్యలను తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ ను రూపొందించామని తెలిపారు. భూమిని కౌలుకు ఇవ్వడం, ఇంటిని కిరాయి ఇవ్వడం మాత్రమేనని అన్నారు. గతంలో నిజాం నవాబుల హయాంలో భూసర్వే జరిగిందని, అనంతరం దేశంలోనే ప్రథమంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంచు సర్వేచేయాలని ఆదేశించామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావుండదని, ప్రశాంతమైన గ్రామాలు తయారవుతాయని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే భూసర్వేకు సైతం రైతుబంధు సమితులు ముందుండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని, రైతులంతా దీనిపై సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భయంకరమైన ఆంక్షలు విధించిందని, ధాన్యం క్వింటాలు కేవలం రూ.1,888 మాత్రమే కొనుగోలు చేయాని, అధిక ధరలకు కోనుగోలు చేస్తే తాము సేకరించబోమనే దుర్మార్గమైన వైఖరి అవలంభిస్తుందన్నారు. రైతులు నియంత్రిత సాగుకు సహకరించారని సీఎం కోరారు. యాసంగి సీజన్ లో సైతం సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు మక్కలను సాగు చేయొద్దని సూచించారు. రైతుల సంక్షేమం కోసం లక్ష కల్లాలను నిర్మించామని, వచ్చే ఏడాది మరిన్ని కల్లాలను నిర్మిస్తామని తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు జిల్లా ప్రజలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కడగండ్ల మండలంలోని రామవరం గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని సీఎం ప్రారంభించి పరిశీలించారు. అనంతరం రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కడగండ్ల మండలంలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జడ్పీ చైర్మన్పసాల సంపత్ రెడ్డి, కలెక్టర్ అనిత సబర్వాల్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.