Breaking News

దుష్ప్రచారం ఆపండి.. ఆస్పత్రి తప్పేం లేదు

చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతూ గత శుక్రవారం గానగాంధర్వుడు, ఎస్పీ బాలు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లోని ప్రజలేకాక యావత్​ దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆయనకు నివాళి అర్పించారు. కాగా ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానపై సోషల్​మీడియాలో కొన్ని రూమర్లు వినిపించాయి. ఆస్పత్రి యాజమాన్యం బాల సుబ్రహ్మణ్యానికి చికిత్స చేసేందుకు లక్షల రూపాయిలు ఫీజు వసూలు చేసిందని.. ఆయన కుమారుడు చరణ్​ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలూ స్నేహితులు భాగ్యరాజ, కమల్​హాసన్​ ఆ డబ్బును చెల్లించారని.. మొత్తం డబ్బులు కట్టకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని కూడా అప్పగించలేదని.. చివరకు వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవడంతో ఆస్పత్రి వాళ్లు బాలు శవాన్ని అప్పగించారని పుకార్లు వచ్చాయి.

అయితే ఈ పుకార్లపై ఎస్పీ బాలు కుమారుడు చరణ్​ స్పందించారు. ‘ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యం ఎక్కువ ఫీజు వసూలు చేసిందని పుకార్లు రావడం బాధాకరం. నిజానికి ఆ ఆస్పత్రి వాళ్లు నాన్నగారిని బతికేందుకు ఎంతో శ్రమించారు. ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. అయినా ఫీజు కట్టలేని దుర్భర స్థితిలో మేము లేము. నాన్నగారి ఆరోగ్యం గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీసిన విషయం నిజమే. ఎంజీఎం హాస్పిటల్ పై అనవసరంగా రూమర్స్​ పుట్టించకండి. ఇప్పటికే నాన్నగారి మృతితో బాధలో ఉన్న మాకు ఇటువంటి వార్తలు మరింత బాధపెడతాయి.’ అని చరణ్​ వివరణ ఇచ్చారు.