Breaking News

దసరా కానుకగా తీరొక్క చీరలు

దసరా కానుకగా తీరొక్క చీరలు

సారథి న్యూస్, ములుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఏడాది మంచి డిజైన్లు, నాణ్యత పరంగా మెరుగుపర్చుకుంటూ ఈ ఏడాది 287 డిజైన్లతో చీరలను తయారు చేశామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో 85వేల మంది, రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారం అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మకు చీరలు పెట్టి ప్రారంభించామని తెలిపారు. ఈ ఏడాది రూ.387కోట్లతో బతుకమ్మ చీరల ద్వారా చేనేత కార్మికులకు పని కల్పించి, మహిళలకు పండగ కానుకగా ఇచ్చామన్నారు. దసరా నాటికి కరోనా వైరస్ అంతమై, మాస్క్ లేకుండా.. ఎవరికి ఎలాంటి కష్టాలు కలగకుండా చల్లగా చూడాలని అమ్మవార్లను కోరారు.

ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వ కానుక అని, నిధులకు ఇబ్బంది ఉన్నా ఆపలేదన్నారు. కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూనే బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. అంతకుముందు మంత్రిని బతుకమ్మలతో ఆహ్వానించారు. ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మంత్రి, ఎంపీలు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంతు, కె.జండగే, అడిషనల్​ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి, డీఆర్డీవో ఏ.పారిజాతం, ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ సకినాల భవానీ పాల్గొన్నారు.