- బలహీనులపై దాడులు జరగకుండా చూడాల్సిందే..
- గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపాల్సిందే
- పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఆకాంక్షించారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థలదేనని సూచించారు. బుధవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతను ప్రథమ ప్రాధాన్యతా అంశంగా తీసుకుని పనిచేస్తోందని అన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థను అరికట్టాలని సూచించారు. అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు ఇరుశాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగ్ నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
అదే స్ఫూర్తితో పనిచేయాలి
తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా ఉందన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ చేస్తున్నట్లు సమాచారం ఉందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలని సూచించారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.
ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను పెంపొందించాలి
చిన్నాపెద్ద అనే తేడా లేకుండా పౌరులందరికీ గౌరవం ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాలని అన్నారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని ఆదేశించారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడుదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తోందన్నారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు.
ఇంటిదాకా గౌరవప్రదంగా సాగనంపాలి
పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. తన జీవితకాలం పాటు డిపార్టుమెంట్‌కు సేవలందించిన ఉద్యోగి రిటైర్డ్అయితే, వారిని సత్కరించి కారులో ఇంటిదాకా దించివచ్చే మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు.
పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్ర పెరగాలి
పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింత కృషిచేయాలన్నారు. హైదరాబాద్ లో పదిలక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డీజీపీకి సీఎం కేసీఆర్ సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని తెలిపారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో నిర్మితమవుతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతిత్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శులు స్మితాసబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జోనల్ ఐజీలు, తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.